పాత వాహనాలను విక్రయించేటప్పుడు సరైన సమయాన్ని ఎంచుకుని నిర్ణయం తీసుకుంటే అదనపు లాభం పొందవచ్చు.
కొత్త వాహనం కొనుగోలు చేసిన వెంటనే పాతదాన్ని అమ్మేయాలనే నిబంధనేమీ లేదు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లో ఉన్న సంవత్సరం, వాహనం తిరిగిన మొత్తం కిలోమీటర్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ల స్థితి, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిశీలించి విక్రయిస్తే మంచి రీసేల్ వాల్యూ లభిస్తుంది.
వాహనం రిజిస్ట్రేషన్ సంవత్సరం మారకముందే విక్రయించడం అనుకూలమైన పద్ధతి. ఉదాహరణకు, ఏడాది ముగియడానికి కొన్ని నెలల ముందే అమ్మడం వల్ల కొనుగోలుదారుడి దృష్టిలో వాహనం వయసు తక్కువగా కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్ కావడంతో వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో విక్రయిస్తే మంచి ధర సులభంగా లభిస్తుంది.
కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనే అంశం కూడా రీసేల్ విలువను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా 50,000 లేదా 1,00,000 కిలోమీటర్ల మార్కును దాటకముందే వాహనాన్ని అమ్మడం మంచిది. ఈ పరిమితి దాటితే మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతాయని కొనుగోలుదారులు భావించే అవకాశం ఉంది. అలాగే ఎప్పటికప్పుడు చేయించిన సర్వీసింగ్ రికార్డులను, రశీదులను భద్రపరచడం వల్ల కొనుగోలుదారుల్లో మరింత నమ్మకం పెరుగుతుంది.
ఇన్సూరెన్స్ గడువు ముగియకముందే వాహనాన్ని అమ్మకానికి పెట్టడం ఎంతో ప్రయోజనకరం. ఇన్సూరెన్స్ లేని వాహనాలను కొనడానికి చాలామంది వెనుకంజ వేస్తారు. వీటితో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC), లోన్ క్లియరెన్స్ లేదా ఎన్‌వోసీ (NOC) వంటి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా విక్రయ ప్రక్రియను వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయవచ్చు.
అందువల్ల తొందరపడి కారును మార్కెట్‌లోకి తీసుకురాకుండా.. పత్రాలన్నీ సిద్ధం చేసుకుని, డిమాండ్ ఎక్కువగా ఉండే సరైన సమయాన్ని ఎంచుకుని అమ్మడమే తెలివైన పని. భారీ ఖర్చుతో కారును మార్పులు చేయడం కంటే, ఇలాంటి చిన్న చిన్న విషయాలపై దృష్టి పెడితేనే అధిక లాభం పొందవచ్చు.

Leave a Reply