వాహనదారులారా జాగ్రత్త! మీ దగ్గర పాత వాహనాలు ఉన్నాయా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా, వాహనాన్ని చూపించకుండా కేవలం ఏజెంట్లకు డబ్బులిచ్చి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందుతున్నారా? అయితే ఈ వార్త మీకు షాక్ ఇవ్వడం ఖాయం. వాహనాల ఫిట్నెస్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేస్తోంది.
నకిలీ సర్టిఫికేట్లకు చెక్: ఇప్పటివరకు వాహనాన్ని తీసుకెళ్లకుండానే ఏజెంట్ల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందే దందా నడిచేది. కానీ, కేంద్ర రవాణా శాఖ (MoRTH) కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ప్రైవేట్ వాహనాలు కూడా కచ్చితంగా అధీకృత ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ల (ATS) లో పరీక్షలు చేయించుకోవాలి. వాహనాన్ని భౌతికంగా అక్కడికి తీసుకెళ్లాల్సిందే.
15 ఏళ్ల పాత వాహనాలకు అగ్నిపరీక్ష: 15 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ (Renewal) కోసం ఆటోమేటెడ్ సెంటర్లకు వెళ్లడం తప్పనిసరి. ఇక్కడ మనుషుల ప్రమేయం లేకుండా మిషన్లే వాహనం యొక్క ఫిట్నెస్ మరియు కాలుష్య స్థాయిని తనిఖీ చేస్తాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ప్రతి ఐదేళ్లకోసారి ఈ పరీక్ష నిర్వహించాలి.
10 సెకన్ల వీడియో తప్పనిసరి: వాహనం నిజంగా టెస్టింగ్ సెంటర్కు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం వీడియో సాక్ష్యం నిబంధన తెచ్చింది.
- సర్టిఫికేట్ ఇచ్చే ముందు వాహనం యొక్క 10 సెకన్ల జియో-ట్యాగ్డ్ వీడియోను పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
- ఈ వీడియోలో వాహనం యొక్క నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ మరియు వాహనం చుట్టూ (360 డిగ్రీలు) స్పష్టంగా కనిపించాలి.
ఫెయిల్ అయితే అంతే సంగతులు: ఒకవేళ మీ వాహనం ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే, దానిని రిపేర్ చేయించి మళ్ళీ పరీక్షించడానికి కేవలం 180 రోజుల (6 నెలలు) గడువు ఇస్తారు. ఆ లోపు పాస్ కాకపోతే, ఆ వాహనాన్ని ‘ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్’ (ELV) గా ప్రకటించి, జాతీయ డేటాబేస్లో దానిని ‘స్క్రాప్’ (గుజరీ) చేయాలని నమోదు చేస్తారు. దీనివల్ల ఆ వాహనం రోడ్డుపై తిరగడానికి అనర్హమవుతుంది.
