ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లా జగత్పూర్ గ్రామానికి చెందిన సుఖ్బీర్ సింగ్ (35), అతని భార్య సోనమ్ (32).
గత 14 ఏళ్ల క్రితం హర్యానా రాష్ట్రం హిసార్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. 2015లో తల్లిదండ్రుల వ్యతిరేకతను కాదని వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 7 ఏళ్ల కుమారుడు, 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
పెళ్లి తర్వాత సుఖ్బీర్ తిరిగి హిసార్‌కు పనికి వెళ్లిపోగా, సోనమ్ గ్రామంలోనే ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో, గత కొన్నేళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానంతో సుఖ్బీర్ ఆమెతో తరచుగా గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో దీపావళి సెలవుల కోసం రెండు రోజుల క్రితం ఊరికి వచ్చిన సుఖ్బీర్కు, సోనమ్‌కు మధ్య మళ్లీ తీవ్ర వివాదం చెలరేగింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం గమనార్హం.
ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో మళ్లీ జరిగిన గొడవతో ఆగ్రహానికి గురైన సుఖ్బీర్, బయటకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొచ్చాడు. ఆ తర్వాత సోనమ్‌ను కుర్చీకి కట్టేసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇంట్లో నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేసి, కాలిపోయిన సోనమ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. పరారీలో ఉన్న క్రూరమైన భర్త సుఖ్బీర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply