మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియావ్రాలో ఒక పామును రక్షించడానికి వెళ్లిన స్నేక్ క్యాచర్‌నే అదే పాము కాటేయడంతో ఆయన దారుణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
40 ఏళ్ల ప్రవేశ్ అలియాస్ బీనూ, దాదాపు 10 సంవత్సరాలుగా పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలే పని చేస్తున్నారు. సుతాలియా రోడ్డు ప్రాంతంలో కట్లపాము (Krait) ఉందనే సమాచారం అందుకోవడంతో, దాన్ని రక్షించడానికి వెళ్లినప్పుడు ఆ పాము ఆయన వేలిపై కాటు వేసింది.
పాము కాటును పెద్దగా పట్టించుకోని బీనూ ఆ పామును పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఆ సమయంలో తన పిల్లలకు కూడా ఆ పామును చూపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత ఆయనకు కంగారు, శరీరంలో అసౌకర్యం మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బియావ్రా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం భోపాల్ తరలించారు. కానీ ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గ మధ్యలోనే బీనూ మరణించారు. బీనూకు భార్య, ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. పాము కాటు వేసిన వెంటనే తీవ్రంగా పరిగణించి చికిత్స పొంది ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని, ఈ ఘటన కుటుంబ సభ్యులను మరియు ఆ ప్రాంత ప్రజలను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.
బీనూ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు పంచనామా ప్రక్రియను పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇన్ని సంవత్సరాలుగా పాములను రక్షిస్తూ వచ్చిన వ్యక్తినే ఆయన రక్షించిన పాము కాటేసి ప్రాణాలు తీయడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply