ముంబైలోని నెహ్రూ నగర్లో ఉన్న ‘మాస్ మెట్రోపాలిస్’ రెసిడెన్షియల్ భవనంలో పుట్టినరోజు వేడుకల అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న 14 మంది లిఫ్ట్‌లో చిక్కుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.
14వ అంతస్తులో జరిగిన పుట్టినరోజు వేడుకల తర్వాత, బంధువులు, అతిథులు కిందకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. లిఫ్ట్ ఎప్పటిలాగే కిందకు దిగుతున్న సమయంలో, 6వ అంతస్తు వద్దకు రాగానే అకస్మాత్తుగా భయంకరమైన కుదుపు ఏర్పడింది. ఆ తర్వాత లిఫ్ట్ వేగంగా కిందకు జారిపోయి, గ్రౌండ్ ఫ్లోర్‌కు కాస్త పైన ఆగిపోయింది.
లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోవడంతో లోపల ఉన్నవారు ఒకరిపై ఒకరు పడిపోయి భయంతో కేకలు వేశారు. పిల్లలు కూడా భయంతో ఏడవడం ప్రారంభించినట్లు సమాచారం. లిఫ్ట్ ఆగిన తర్వాత కూడా వారి కష్టాలు తీరలేదు. తలుపులు తెరుచుకోకపోవడంతో అంతా లోపలే చిక్కుకుపోయారు. కారుకట్లో ఉన్న వారు ఎమర్జెన్సీ అలారం నొక్కి సహాయం కోసం అభ్యర్థించారు. బయట ఉన్న భవన వాసులు తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. లిఫ్ట్ తలుపులు రాకపోవడంతో, రెస్క్యూ సిబ్బంది కట్టర్లు, హైడ్రాలిక్ పరికరాలను ఉపయోగించి లిఫ్ట్‌ను తెరవడానికి ప్రయత్నించారు. సుమారు 3 గంటల పాటు శ్రమించిన తర్వాత, లిఫ్ట్‌లోని ఒక భాగాన్ని కత్తిరించి లోపల చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. బయటకు వచ్చిన వారిలో చాలా మంది తీవ్ర భయాందోళనల్లో ఉన్నారని, పిల్లలను కూడా సురక్షితంగా రక్షించామని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. లిఫ్ట్‌లో అనుమతించిన సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణించారా? నిర్వహణలో ఏమైనా లోపం ఉందా? లేక సాంకేతిక లోపం వల్ల లిఫ్ట్ ఒక్కసారిగా పడిపోయిందా? అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. లిఫ్ట్ ప్రయాణికుల సామర్థ్యం, బరువు, నిర్వహణ రికార్డులు, భద్రతా తనిఖీలకు సంబంధించిన వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందని అధికారులు వెల్లడించారు.
