“పాలలో డిటర్జెంట్ పౌడర్.. అరటిపండ్లలో రసాయనాలు..!” 11 ప్రముఖ హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌డీఏ మెరుపు దాడుల్లో వెలుగుచూసిన దిగ్భ్రాంతికర నిజాలు.. ఏం జరుగుతోంది..??

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుసగా మెరుపు దాడులు నిర్వహిస్తోంది.

నవీ ముంబైలోని ఏపీఎంసీ (APMC) పండ్ల మార్కెట్‌లో రసాయనాలతో కృత్రిమంగా పండించిన దాదాపు 1,394 కిలోల అరటిపండ్లను అధికారులు సీజ్ చేశారు. ‘ఎథెఫాన్’ (Ethephon) అనే రసాయనాన్ని నీటిలో కలిపి, అందులో అరటిపండ్లను ముంచి పండిస్తున్నట్లు తనిఖీల్లో బట్టబయలైంది.

అంతేకాకుండా, ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు కలిపి మొత్తం 11 ఆహార సంస్థల లైసెన్సులను ఎఫ్‌డీఏ రద్దు చేసింది. వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు తిరగడం, ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, అపరిశుభ్రమైన వ్యర్థాల నిర్వహణ, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగించడం వంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

ఇదిలా ఉండగా, ముంబై మరియు పాల్ఘర్ జిల్లాల్లో నిషేధిత గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలతో పాటు దాదాపు రూ. 1.29 కోట్ల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

సోలాపూర్ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో దాదాపు 16,730 లీటర్ల పాలలో డిటర్జెంట్ (సబ్బు పొడి) కలిపినట్లు నిర్ధారణ కావడంతో, ఆ కల్తీ పాలను అధికారులు పూర్తిగా పారబోసి ధ్వంసం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాలలో కల్తీకి పాల్పడిన సంస్థల యజమానులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఆహార పదార్థాలలో రసాయనాలు, విచ్చలవిడిగా కల్తీలకు పాల్పడటం ప్రజారోగ్యానికి పెను ముప్పుగా మారింది. ఆహార నాణ్యతకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే, వెంటనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎఫ్‌డీఏ అధికారులు ప్రజలను కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *