ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దేవ్ పహారీ (Devpahari) జలపాతాన్ని వీక్షించేందుకు ముగ్గురు స్నేహితులు సరదాగా పిక్నిక్ వెళ్లారు.
అయితే, వారు అక్కడికి చేరుకున్న సమయంలో హఠాత్తుగా కుండపోత వర్షం కురవడంతో పక్కనే ఉన్న నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా పెరిగింది. ఉగ్రరూపం దాల్చిన వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన ఆ యువకులు.. బయటపడే మార్గం కనిపించక నది మధ్యలో ఉన్న ఒక చిన్న రాతి దిబ్బ (ఐలాండ్) పైకి ఎక్కి తలదాచుకున్నారు.
వరద నీరు నలువైపులా పోటెత్తడంతో పాటు చీకటి పడటంతో ఒడ్డుకు రాలేకపోయారు. ఎముకలు కొరికే చలిలో, ఆకలితో వణుకుతూ ఆ రాత్రంతా ప్రాణభయంతో ఆ రాతి దిబ్బపైనే గడిపారు. దాదాపు 15 గంటలకు పైగా మృత్యువుతో పోరాడుతున్న వారి గురించి స్థానికులు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఉదయానికి నదిలో నీటి ఉధృతి కాస్త తగ్గడంతో, సహాయక బృందాలు తాళ్ల సాయంతో నదిని దాటి ఆ ముగ్గురు యువకులను క్షేమంగా ఒడ్డుకు చేర్చాయి. ఈ ఘటన అనంతరం.. భారీ వర్షాలు కురిసే సమయాల్లో ప్రమాదకరంగా ప్రవహించే నదులు, జలపాతాల వద్దకు వెళ్లే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply