మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమా? చెల్లింపుల కోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతుంటారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. ప్రపంచవ్యాప్తంగా ‘ఘోస్ట్ ట్యాపింగ్’ (Ghost Tapping) అనే కొత్త రకం డిజిటల్ పేమెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఈ స్కామ్ ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. కార్డులు మరియు స్మార్ట్ఫోన్లలో ఉండే NFC (Near Field Communication) టెక్నాలజీని స్కామర్లు తప్పుగా వాడుకుంటున్నారు. విమానాశ్రయాలు, పండుగలు, రద్దీగా ఉండే మార్కెట్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారు.
‘ఘోస్ట్ ట్యాపింగ్’ స్కామ్ అంటే ఏమిటి? కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ (ట్యాప్-టు-పే) ప్రాచుర్యం పొందుతున్న కొద్దీ, మోసగాళ్లు కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. ఘోస్ట్ ట్యాపింగ్‌లో, స్కామర్ ఒక NFC రీడర్ సాయంతో మీకు తెలియకుండానే మీ కార్డు లేదా ఫోన్ నుండి లావాదేవీని ప్రారంభిస్తాడు. దీనికి కార్డు వివరాలు ఎంటర్ చేయక్కర్లేదు, ఓటీపీ కూడా రాదు. మీ ఫోన్ లేదా కార్డులో ‘ట్యాప్-టు-పే’ ఆన్ చేసి ఉంటే, స్కామర్ మీ పక్కన నిలబడి కూడా డబ్బులు డ్రా చేయగలడు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? స్కామర్లు తమ వద్ద పోర్టబుల్ NFC రీడర్లు లేదా మార్పులు చేసిన స్మార్ట్ఫోన్లను ఉంచుకుంటారు. రద్దీగా ఉండే చోట మీ దగ్గరకు వచ్చి, కొన్ని సెకన్ల పాటు మీ జేబు లేదా బ్యాగ్ దగ్గర తమ డివైజ్‌ను ఉంచుతారు. దీనివల్ల మీ కార్డు నుండి చిన్న మొత్తంలో నగదు కట్ అవుతుంది. ఒక్కోసారి నకిలీ వ్యాపారులు తక్కువ ధర చూపి, ట్యాప్ చేయమని అడుగుతారు, కానీ ఆ తర్వాత పెద్ద మొత్తం కట్ అయినట్లు మీకు ఆలస్యంగా తెలుస్తుంది.
పర్యాటకులు సులభంగా ఎందుకు మోసపోతారు? విదేశీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు త్వరగా చెల్లింపులు చేయడానికి ప్రజలు ట్యాప్-టు-పేని నమ్ముతారు. రద్దీలో అప్రమత్తత తగ్గుతుంది. పైగా విదేశీ కరెన్సీ లెక్కల్లో ఉండే కన్ఫ్యూజన్ వల్ల ఎంత డబ్బు కట్ అయ్యిందో వెంటనే అర్థం కాదు.
ప్రయాణాల్లో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
- NFC ఆఫ్ చేయండి: అవసరం లేనప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోని NFC ఫీచర్‌ను డిసేబుల్ చేయండి.
- RFID-బ్లాకింగ్ వాలెట్: కార్డుల నుండి సిగ్నల్స్ బయటకు వెళ్లకుండా ఉండే RFID-బ్లాకింగ్ వాలెట్లు లేదా కార్డు స్లీవ్స్ వాడండి.
- బయోమెట్రిక్ లాక్: మొబైల్ వాలెట్ల (Google Pay, Apple Pay)కు ఫేస్ లాక్ లేదా ఫింగర్ ప్రింట్ తప్పనిసరిగా వాడండి.
- ఇన్స్టంట్ అలర్ట్స్: ప్రతి లావాదేవీకి సంబంధించి మీ ఫోన్‌కు వెంటనే మెసేజ్ వచ్చేలా బ్యాంక్ అలర్ట్స్ ఆన్ చేసుకోండి.
- అపరిచిత ప్రాంతాల్లో జాగ్రత్త: గుర్తింపు లేని చిన్న చిన్న స్టాల్స్ లేదా ఫుట్‌పాత్ షాపుల్లో ట్యాప్-టు-పే వాడకుండా ఉండటమే మంచిది.
