వాతావరణ మార్పులతో పాటు వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నందున, పిల్లల ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించడం చాలా అవసరం.
పిల్లల ఊపిరితిత్తులు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని దశలో ఉన్నందున, కలుషితమైన గాలి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లలు ఆరోగ్యంగా కనిపిస్తున్నా, ఎప్పటిలాగే ఆడుకుంటున్నా, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకపోయినా.. కాలుష్యం ప్రభావం వారి ఊపిరితిత్తులపై పడే అవకాశం ఉంటుంది. గాలిలోని పీఎం 2.5 (PM2.5) వంటి అత్యంత సూక్ష్మ కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి వాపును కలిగిస్తాయి. దీని దుష్ప్రభావాలు ఒక్కోసారి వెంటనే బయటపడకపోవచ్చు.
పెద్దలతో పోలిస్తే, పిల్లలు తమ శరీర పరిమాణానికి తగ్గట్టుగా వేగంగా శ్వాస తీసుకుంటారు. అంతేకాకుండా, పరిగెత్తేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఎక్కువ గాలిని పీల్చుకుంటారు కాబట్టి, కలుషిత గాలి ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఇలాంటి కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతింటుంది, వాటి సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాకుండా ఆస్తమా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇప్పటికే ఆస్తమా లేదా అలెర్జీలు ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
పిల్లలను రక్షించుకోవడానికి, తల్లిదండ్రులు తమ ప్రాంతంలోని గాలి నాణ్యతా సూచీని (AQI) ప్రతిరోజూ గమనిస్తుండాలి. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, పిల్లలు బయట వేగంగా పరిగెత్తడం, ఆడుకోవడం, వ్యాయామం చేయడం వంటివి తగ్గించాలి. ఇంటి లోపల సిగరెట్ పొగ, అగరుబత్తీల పొగ వంటి గాలిని కలుషితం చేసే కారకాలకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. అవసరాన్ని బట్టి ‘హెపా’ (HEPA) ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్‌ను ఉపయోగించడం వల్ల ఇంటి లోపల గాలిలో తేలియాడే సూక్ష్మ కణాలను తగ్గించవచ్చు.
పిల్లలకు నిరంతరం దగ్గు రావడం, రాత్రిపూట దగ్గు తీవ్రమవ్వడం, శ్వాస తీసుకుంటున్నప్పుడు పిల్లికూతలు (విజిల్ లాంటి శబ్దం) రావడం, ఆడుకుంటున్నప్పుడు ఆయాసపడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా, వాయు కాలుష్యం పెరిగే కాలంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా పిల్లల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
