తమిళనాడు : తిరుత్తణి సమీపంలో ఒక ఆయుర్వేద క్లినిక్ నిర్వహిస్తున్న భాస్కర్ అనే వ్యక్తి, సంతానలేమి సమస్యతో చికిత్స కోసం వచ్చిన 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలోని చిన్న నాగపూండి గ్రామంలో 52 ఏళ్ల భాస్కర్ అనే వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నాడు. తాను గొప్ప వైద్యుడినని చెప్పుకుంటూ స్థానికులకు చికిత్స అందిస్తున్నాడు. ఈ క్రమంలో, తామినేరి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి సంతానలేమి సమస్యపై చికిత్స కోసం భాస్కర్‌ను సంప్రదించింది.
చికిత్స పేరుతో ఆ యువతిని విడిగా ఒక గదిలోకి తీసుకెళ్లిన భాస్కర్, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడటానికి ప్రయత్నించాడు. భయపడిన యువతి కేకలు వేస్తూ గదిలోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, వెంటనే తిరుత్తణి పోలీస్ స్టేషన్లో భాస్కర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు: పోలీసు విచారణలో భాస్కర్ ఒక నకిలీ వైద్యుడని తేలింది. అసలు ఆయుర్వేదం చదివిన భాస్కర్, తాను ఎంబీబీఎస్ (MBBS) డాక్టరునని నమ్మబలుకుతూ, రోగులకు అల్లోపతి మందులు ఇస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇతర వైద్యుల కంటే ఫీజు రూ. 50 తక్కువగా ఉండటంతో చాలామంది అతడి వద్దకే వెళ్లేవారు. అయితే, ఇప్పటివరకు ఎంతమంది అతని నకిలీ చికిత్స వల్ల అనారోగ్యం పాలయ్యారో తెలియరాలేదు.
కేవలం ఫిర్యాదు చేసిన ఈ యువతిని మాత్రమే కాకుండా, గతంలో ఇంకా ఎవరైనా ఇతని వేధింపులకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. భాస్కర్‌పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సంతానలేమి చికిత్స కోసం వెళ్లిన చోట ఇలాంటి దారుణం జరగడం, పైగా సదరు వ్యక్తి నకిలీ డాక్టర్ అని తెలియడం తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది.
