బెంగళూరు: సాధారణంగా పక్కింటి వాళ్ల మధ్య ఆస్తుల గొడవలో, నీళ్ల గొడవలో చూస్తుంటాం. కానీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం ఒక ‘వింత’ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. రెండు పిల్లుల మధ్య జరిగిన ‘ప్రేమాయణం’ కాస్తా రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. శేషాద్రిపురం పరిధిలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
శేషాద్రిపురంలోని ఒక ఇంట్లో ఆడ పిల్లి ఉండగా, పక్కింటి వారు మగ పిల్లిని పెంచుకుంటున్నారు. కాలక్రమేణా ఆ రెండు పిల్లుల మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఆడ పిల్లి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఆడ పిల్లి యజమానులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. తమ పిల్లి గర్భవతి కావడానికి, పిల్లలు పుట్టడానికి పక్కింటి మగ పిల్లే కారణమంటూ వారితో ఘర్షణకు దిగారు.
పిల్లలను పక్కింటి వాకిట్లో పారేసి..
ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో, ఆడ పిల్లి యజమానులు ఆ నాలుగు పిల్లి పిల్లలను తీసుకెళ్లి మగ పిల్లి యజమానుల ఇంటి ముందు పడేశారు. “మీ పిల్లి వల్ల పుట్టిన ఈ పిల్లల బాధ్యత మీదే” అంటూ నానా రచ్చ చేశారు. గొడవ పెద్దదవ్వడంతో మాట మాట పెరిగి, “మీ పిల్లలపై యాసిడ్ పోస్తాం” అంటూ ఆడ పిల్లి యజమానులు తీవ్రమైన బెదిరింపులకు దిగారని పక్కా వారు ఆరోపిస్తున్నారు.
అనాథలైన పిల్లి పిల్లలు.. పోలీసుల ఎంట్రీ!
ఈ గొడవల మధ్య ఆ పసి పిల్లి పిల్లలు తల్లికి దూరమై అల్లాడిపోతున్నాయి. అటు తల్లి పిల్లి కూడా తన పిల్లల కోసం వెతుకుతూ తల్లడిల్లుతోంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో మగ పిల్లి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన శేషాద్రిపురం పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జంతువుల సహజ సిద్ధమైన ప్రవర్తనకు మనుషులు కొట్టుకోవడం ఏంటని పోలీసులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లుల సాన్నిహిత్యం మనుషుల మధ్య చిచ్చు పెట్టి, చివరికి ‘యాసిడ్’ దాడుల బెదిరింపుల వరకు వెళ్లడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
