పురిట్లోనే విషాదం – ఇంక్యుబేటర్ వేడికి పసికందు మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం కారణంగా పసిపాప ప్రాణాలు కోల్పోయింది. పుట్టిన కొన్ని గంటలకే ఆ ఆడబిడ్డ ఇంక్యుబేటర్ వేడికి కాలిపోయి మరణించింది. బిత్తూర్‌లోని ‘రాజా నర్సింగ్ హోమ్‌’లో ఈ దారుణం జరిగింది.

అసలేం జరిగిందంటే? శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పి పాపను ఐసీయూలోని వార్మర్ మెషీన్‌లో ఉంచారు. అయితే, సిబ్బంది మెషీన్ ఆన్ చేసి దాని గురించి మర్చిపోయినట్లు తెలుస్తోంది. మెషీన్ అతిగా వేడెక్కడంతో పాప ముఖం, ఛాతీ, కడుపు భాగం పూర్తిగా కాలిపోయాయి. ఆ చిన్నారి శరీరం నల్లగా మారిపోయింది.

పాప మరణించిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం దాదాపు 5 గంటల పాటు తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టింది. బిడ్డను చూడనివ్వకుండా అడ్మిషన్ పత్రాల పేరుతో వారిని తప్పుదోవ పట్టించారు. బాధితుడు అరుణ్ నిషాద్ మరియు బిట్టు దంపతుల తొలి సంతానం ఈ పాప. ఆ తల్లి తన బిడ్డను కనీసం ఒక్కసారి కూడా చూడలేకపోయింది. ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు ఆసుపత్రి వారు రెండు లక్షల రూపాయలు ఆశ చూపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

“భూమి మీద దేవుళ్లని నమ్మే డాక్టర్లే నా బిడ్డను చంపేశారు. మా పాప ఎలా చనిపోయిందో నా భార్యకు చెప్పే ధైర్యం కూడా నాకు లేదు” అని తండ్రి అరుణ్ నిషాద్ కన్నీరుమున్నీరయ్యారు.

అధికారుల చర్యలు: కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించినట్లు అడిషనల్ మెడికల్ ఆఫీసర్ రమిత్ రస్తోగి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని ఎన్‌ఐసీయూ (NICU) విభాగాన్ని అధికారులు మూసివేశారు.


Posted

in

by

Tags: