ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ మహిళలు పురుషుల కంటే సగటున ఎక్కువ కాలం జీవిస్తుండటం ఒక సాధారణ విషయం. 65 ఏళ్లు పైబడిన జనాభాలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం, వయస్సు పెరిగే కొద్దీ ఈ అంతరం మరింత పెరగడం మనం గమనిస్తుంటాం. హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు ఆయుర్దాయం పురుషుల కంటే సుమారు 7 ఏళ్లు ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణాలు కేవలం ఒకటి కాదు, అనేక జీవసంబంధిత మరియు జీవనశైలికి సంబంధించిన అంశాలు ఉన్నాయి.
అసలు కారణాలేమిటి?
- మెదడు అభివృద్ధిలో తేడాలు: హార్వర్డ్ హెల్త్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అంతరం చిన్నప్పటి నుండే మొదలవుతుంది. నిర్ణయాలు తీసుకోవడం మరియు పనుల పర్యవసానాలను అర్థం చేసుకునే మెదడులోని భాగం, అబ్బాయిల్లో అమ్మాయిల కంటే కొంత ఆలస్యంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే, చిన్న వయసులో అబ్బాయిలు ప్రమాదకరమైన పనుల వైపు మొగ్గు చూపుతారు, దీనివల్ల ప్రమాదాలు మరియు హింసాత్మక ఘటనల్లో మరణించే ముప్పు వారికి ఎక్కువగా ఉంటుంది.
- వృత్తిపరమైన ప్రమాదాలు: పురుషుల తక్కువ ఆయుర్దాయానికి వృత్తి కూడా ఒక కారణం. సైన్యం, అగ్నిమాపక దళం, నిర్మాణ రంగం వంటి ప్రమాదకరమైన పనుల్లో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పనుల్లో ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండటం వల్ల ఆయుర్దాయంపై ప్రభావం పడుతుంది.
- గుండె జబ్బుల ప్రభావం: గుండె జబ్బులు కూడా ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం. నివేదికల ప్రకారం, పురుషుల్లో గుండె జబ్బులతో మరణించే ప్రమాదం మహిళల కంటే దాదాపు 50 శాతం ఎక్కువగా ఉంది. హార్మోన్లలో మార్పులతో పాటు, హై బ్లడ్ ప్రెజర్, చెడు కొలెస్ట్రాల్ మరియు ఆరోగ్య సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం వంటివి దీనికి కారణమవుతాయి.
- మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య విషయంలోనూ పురుషులు వెనుకబడి ఉన్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. డిప్రెషన్ లేదా మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, సహాయం తీసుకోవడానికి చాలామంది పురుషులు వెనుకాడతారు. సమాజంలోని కొన్ని మూస పద్ధతులు (Social stigma) తమ సమస్యలను బయటకు చెప్పుకోవడానికి వారిని అడ్డుకుంటున్నాయి, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- సామాజిక సంబంధాలు: పరిశోధనల ప్రకారం, మహిళల సామాజిక సంబంధాలు పురుషుల కంటే సాధారణంగా బలంగా ఉంటాయి. కుటుంబం, స్నేహితులు మరియు సమాజంతో మమేకమై ఉండటం మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానికి భిన్నంగా, సామాజికంగా ఒంటరిగా ఉండేవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది, ఈ పరిస్థితి పురుషుల్లోనే అధికం.
