పెంగ్విన్: సమూహాన్ని ఎదిరించి మృత్యువు వైపు అడుగులేసిన ఏకాకి వీరుడు!

2026 ప్రారంభంలో సోషల్ మీడియాలో ఒక పెంగువిన్ (Penguin) వీడియో వైరల్ సెన్సేషన్ అయ్యింది. తెల్లని మంచు కొండల మధ్య ఏకాకిగా, ఎటు వెళ్తుందో తెలియకుండా నడుస్తున్న ఈ పెంగువిన్ దృశ్యం నెటిజన్ల మనసును కలచివేస్తోంది. దీనిని నెటిజన్లు ‘నిహిలిస్ట్ పెంగువిన్’ (Nihilist Penguin) అని పిలుస్తున్నారు. ఈ వీడియో వెనుక ఉన్న విషాదకరమైన కథ మరియు జీవిత పాఠం ఇక్కడ ఉంది:

సాధారణంగా పెంగువిన్లు గుంపులుగా ఉంటాయి. ఆకలి వేస్తే సముద్రం వైపు వెళ్లి చేపలను వేటాడి తింటాయి. కానీ ఈ వీడియోలోని పెంగువిన్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. తన కాలనీలోని వేలాది పెంగువిన్లు సముద్రం వైపు వెళ్తుంటే, ఇది మాత్రం దానికి పూర్తి వ్యతిరేక దిశలో ప్రయాణం మొదలుపెట్టింది.

సముద్రం వదిలి కొండల వైపు.. ఎందుకు?

ఆహారం దొరికే సముద్రం వైపు కాకుండా, జన సంచారం లేని, ఆహారం దొరకని, కేవలం మంచు గడ్డలు మాత్రమే ఉన్న కొండల వైపు (Inland) ఇది ఒంటరిగా అడుగులు వేస్తోంది. ఆ మార్గంలో సుమారు 70 కిలోమీటర్ల వరకు ఏమీ ఉండదు. ఆ ప్రయాణం చివరన మిగిలేది కేవలం మరణం మాత్రమే.

ఇది రీల్స్ కోసం తీసింది కాదు.. 2007 నాటి సత్యకథ!

ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదు. ప్రసిద్ధ జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్నర్ హెర్జోగ్ (Werner Herzog) 2007లో తీసిన ‘ఎన్‌కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’ అనే డాక్యుమెంటరీలోని దృశ్యం ఇది. షూటింగ్ సమయంలో పెంగువిన్ ప్రవర్తన చూసి హెర్జోగ్ ఆశ్చర్యపోయారు. ఇది దారి తప్పి వెళ్లడం లేదని, కావాలనే అందరినీ వదిలి వెళ్తోందని ఆయనకు అర్థమైంది.

  • డెత్ మార్చ్ (Death March): డైరెక్టర్ దీనిని ‘మృత్యు యాత్ర’ అని పిలిచారు. ఆ పెంగువిన్ దారి మళ్లించి వెనక్కి పంపాలని ప్రయత్నించినా, అది మళ్ళీ తిరిగి అదే మంచు కొండల వైపు అడుగులు వేసింది. అంటే బతుకుపై ఆశ వదులుకున్నట్లు ఆ మూగజీవి ప్రవర్తించింది.
2026లో ఎందుకు వైరల్ అయ్యింది?

జనవరి 16న ఈ పాత క్లిప్‌కు ఒక ఎమోషనల్ మ్యూజిక్ జోడించి ఎవరో ఎడిట్ చేశారు. నేటి ఆధునిక కాలంలో మనుషులు అనుభవిస్తున్న ఒంటరితనం, మానసిక ఒత్తిడి (Burnout) మరియు “అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలి” అనే భావనతో ఈ పెంగువిన్ ప్రయాణాన్ని నెటిజన్లు పోల్చుకుంటున్నారు. అందుకే ఇది కోట్లాది మందికి కనెక్ట్ అయ్యి కన్నీళ్లు తెప్పిస్తోంది.


Posted

in

by

Tags: