గత కొంతకాలంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. పసిడి ధర ఎక్కడ ఆగుతుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేయడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని ఇప్పటి వరకు మనం విన్నాం. కానీ, అది మాత్రమే పూర్తి నిజం కాదు! బంగారం ధరల వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
స్విట్జర్లాండ్ అణు బంకర్లలో ఏం జరుగుతోంది? స్విట్జర్లాండ్‌లో శీతల యుద్ధ కాలం నాటి సుమారు 3,70,000 పాత అణు బంకర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిలో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, ఒకానొక బంకర్ లోపల ప్రస్తుతం అత్యంత రహస్యంగా, వారానికి ఒక టన్ను కంటే ఎక్కువ బంగారాన్ని తరలిస్తున్నారు. ఈ హై-సెక్యూరిటీ వాల్ట్ (Vault) క్రిప్టో దిగ్గజం ‘టెథర్ హోల్డింగ్స్ ఎస్.ఏ’ (Tether Holdings SA) ఆధీనంలో ఉంది. ప్రభుత్వాలు, బ్యాంకులను మినహాయిస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు నిల్వ ఇదే కావచ్చు.
దీనిని కంపెనీ సీఈఓ సరదాగా “జేమ్స్ బాండ్ సినిమాలోని ప్రదేశం” అని పిలుస్తారు. ఉక్కు తలుపుల పొరల మధ్య, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఈ బంగారాన్ని దాస్తున్నారు.
టెథర్ ఎందుకు కొంటోంది? గత ఏడాది కాలంగా టెథర్ కంపెనీ నిశ్శబ్దంగా గ్లోబల్ గోల్డ్ మార్కెట్లో తన ఉనికిని చాటుకుంది. క్రిప్టో మరియు గోల్డ్ ఇన్వెస్టర్ల ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది – ఇద్దరూ ప్రభుత్వాల అప్పులు మరియు ఆర్థిక విధానాలను పూర్తిగా నమ్మరు. ప్రభుత్వాలు అప్పులు పెంచి, నోట్లను ఎక్కువగా ముద్రిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, కరెన్సీ విలువ తగ్గుతుందని వారి భయం. అందుకే సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
రికార్డు స్థాయికి ధరలు: పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు బంగారం వైపు రావడంతో డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గోల్డ్ రేట్ మొదటిసారిగా ఔన్సు (ounce) కు 5,200 డాలర్ల మార్కును దాటింది. టెథర్ వంటి సంస్థలు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనడం వల్ల మార్కెట్లో లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ‘గోల్డ్ సెంట్రల్ బ్యాంక్’ దిశగా.. బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో టెథర్ సీఈఓ పాలో అర్డోయినో మాట్లాడుతూ.. భవిష్యత్తులో అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా బంగారం మద్దతు ఉన్న కొత్త కరెన్సీలు రావచ్చని అభిప్రాయపడ్డారు. టెథర్ వద్ద ప్రస్తుతం సుమారు 140 టన్నుల బంగారం ఉంది, దీని విలువ దాదాపు 24 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఈ కంపెనీ 70 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. పోలాండ్ దేశం (102 టన్నులు) తప్ప మరే దేశపు సెంట్రల్ బ్యాంక్ కూడా ఇంత భారీగా బంగారం కొనలేదు.
