ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో అదనపు కట్నం కోసం ఓ వివాహితను గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మృతురాలు శీతల్ భర్త, అతని కుటుంబ సభ్యులపై ఈ మేరకు ఆరోపణలు వెల్లువెత్తాయి. వివాహ సమయంలో తాము సుమారు రూ.12 లక్షలు ఖర్చు చేశామని, ఆ తర్వాత కూడా రూ.5 లక్షల నగదు, బుల్లెట్ మోటార్‌సైకిల్ కావాలని డిమాండ్ చేస్తూ శీతల్‌ను వేధించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి భర్త సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫరీదాబాద్ జిల్లా బల్లబ్ఘర్ ప్రాంతానికి చెందిన శీతల్‌కు, మధుర జిల్లా చౌముహా గ్రామానికి చెందిన జైగోపాల్తో 2023 జూన్ 23న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత అదనపు కట్నం కోసం శీతల్‌ను వేధించినట్లు ఆమె సోదరుడు మాన్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా, శీతల్‌పై దాడి చేశారని, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మాన్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కట్నం డిమాండ్ నెరవేర్చకపోవడంతో అక్టోబర్ 22న శీతల్‌పై దాడి చేసి గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో శీతల్ భర్త జైగోపాల్, అత్త జమున, మామ దీము, ఇతర బంధువులు గుడియా, గిరిధారి, సంజు తదితర ఆరుగురి పేర్లను చేర్చారు. తమకు న్యాయం జరగాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని శీతల్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదని శీతల్ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) వరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జైత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనలో వచ్చిన ఆరోపణలు విచారణ, కోర్టు ప్రక్రియల ద్వారా నిర్ధారించబడాల్సి ఉందన్నారు. కాగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని శీతల్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.
