మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బోర్డ్ పరీక్షల సమయంలో జరిగిన ఒక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాల వాష్‌రూమ్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పోలీస్ విచారణలో ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.
పరిచయమున్న ఒక యువకుడు గత కొన్ని నెలలుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ విద్యార్థిని వెల్లడించింది. తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన వైద్య పరీక్షలు మరియు స్టేట్మెంట్ నమోదు ప్రక్రియలో ఆమె పూర్తి వివరాలను పోలీసులకు వివరించింది.
నిందితుడితో పరిచయం ఎలా ఏర్పడింది?
ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం.. 2024లో జరిగిన గర్బా వేడుకల సమయంలో నిందితుడితో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. తన తండ్రి మొబైల్ ఫోన్ ద్వారా ఆ యువకుడితో మాట్లాడేదాన్నని బాలిక తెలిపింది.
- బలవంతం: మే 2025లో ఆ యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని కోరాడని, తాను నిరాకరించడంతో తన అద్దె గదికి తీసుకెళ్లి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె వాపోయింది.
కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?
ఈ విషయాన్ని బయట పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిందితుడు ఆమెను బెదిరించాడు. ఆ తర్వాత కూడా పదేపదే ఫోన్ చేస్తూ, తన గదికి పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. భయం మరియు పరువు పోతుందనే ఆందోళనతో గర్భం దాల్చిన విషయాన్ని కూడా తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది.
పాఠశాలలో ఏం జరిగింది?
బోర్డ్ పరీక్ష రాస్తున్న సమయంలో బాలికకు అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. పరీక్ష గది నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్న ఆమె, ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన పాఠశాల సిబ్బంది వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా, ఆమె అక్కడ శిశువుకు జన్మనిచ్చింది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డిఎస్పీ ఉమాకాంత్ చౌదరి మాట్లాడుతూ.. కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

Leave a Reply