పెళ్లి తర్వాత ఉద్యోగానికి వెళ్లనని యువతి చెప్పడంతో, ఏడాదికి రూ.30 లక్షల వేతనం పొందుతున్న ఓ యువకుడు ఆ పెళ్లి సంబంధాన్ని తిరస్కరించిన ఘటన ప్రస్తుతం ‘ఎక్స్’ (X) వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
షీతల్ రిజ్వానీ అనే నెటిజన్ తన స్నేహితురాలికి ఎదురైన ఈ అనుభవాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేసే యువతినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంటున్నట్లు ఆ యువకుడు ప్రారంభంలోనే స్పష్టంగా చెప్పాడు.
సదరు యువతి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నప్పటికీ, పెళ్లి తర్వాత ఉద్యోగాన్ని కొనసాగించడం ఇష్టం లేదని తెలపడంతో ఆ యువకుడు పెళ్లి చర్చలను నిలిపివేశాడు. యువకుడి ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన ఆ యువతి, అతడు సంకుచిత మనస్తత్వం గలవాడని, మహిళల స్వేచ్ఛకు వ్యతిరేకి అని ఆరోపించింది.
ఈ వివాదం గురించి ఆ యువతి తన ఇంట్లో కూడా చెప్పడంతో, అప్పటికే వ్యాపారపరంగా సంబంధాలు ఉన్న ఇరు కుటుంబాల మధ్య దీనివల్ల మనస్పర్థలు తలెత్తినట్లు ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటన నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లాలా వద్దా అనేది మహిళ హక్కు అయితే, తనకు తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కూడా ఆ యువకుడి హక్కేనని ఒక వర్గం వాదిస్తోంది. మరోవైపు, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని మరో వర్గం అభిప్రాయపడుతోంది.

Leave a Reply