వివాహ బంధం ముగియడాన్ని ఒక వైఫల్యంగా చూడకుండా, కొత్త జీవితానికి నాందిగా జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించింది దక్షిణ కొరియాకు చెందిన 37 ఏళ్ల మహిళ చో సియుంగ్-యోన్.
సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, సింగిల్ మదర్ అయిన ఆమె, తన విడాకుల పట్ల బాధపడకుండా, తన సన్నిహిత మిత్రులతో కలిసి ఓ ప్రత్యేక విందును ఏర్పాటు చేసుకుని వేడుకగా జరుపుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన వీడియోలో.. మెరిసే దుస్తులు ధరించి, సంగీతం, కేక్ కటింగ్, ఫొటోలు, సరదా సంభాషణలతో స్నేహితుల మధ్య సంతోషంగా గడుపుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోలో, “మీ పెళ్లి కంటే విడాకుల వేడుక అద్భుతంగా ఉండే క్షణం” అని ఆమె రాసిన క్యాప్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాకుండా, “కష్టకాలంలో నాకు అండగా నిలిచిన నా ప్రియమైన వారికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను!” అని కూడా ఆమె పోస్ట్ చేసింది.
విడాకులు తీసుకున్న మహిళలపై సమాజం చేసే విమర్శలను, వారిని చూసే సంకుచిత కోణాన్ని మార్చాలన్నదే తన లక్ష్యమని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. వివాహ బంధానికి అతీతంగా మహిళలకు ఒక సొంత గుర్తింపు, సంతోషకరమైన జీవితం ఉంటుందని చాటిచెప్పడానికే ఆమె ఈ వేడుకను జరుపుకుంది. చో సియుంగ్-యోన్ తీసుకున్న ఈ ధైర్యమైన, సానుకూల నిర్ణయానికి ఇంటర్నెట్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విడాకుల పట్ల సమాజ దృక్పథంపై ఒక ఆరోగ్యకరమైన చర్చకు తెరతీసింది.

Leave a Reply