మరో కొద్ది రోజుల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సింది. పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడి మాజీ ప్రేయసి కక్షతో రగిలిపోయి, పెళ్లి కుమార్తెపై యాసిడ్‌తో దాడి చేసిన అమానుష ఘటన ఇందిరా విహార్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
నవ్వుతూ వచ్చి.. నరకం చూపించి..
ఇందిరా విహార్‌కు చెందిన 26 ఏళ్ల యువతికి, అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ఈ నెల ఏప్రిల్ 19న వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 14) యువతి నివాసంలో మెహందీ వేడుక ఎంతో వేడుకగా ప్రారంభమైంది. బంధువుల కోలాహలం, సంగీతంతో ఇల్లంతా సందడిగా ఉంది.
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. వరుడి మాజీ ప్రేయసి అక్కడికి చేరుకుంది. ఆమె పెళ్లి కుమార్తెకు పొరుగున నివసించే యువతే కావడంతో ఎవరికీ ఎటువంటి అనుమానం కలగలేదు. మెహందీ గురించి ముచ్చటిస్తూనే, ఆమె తన వెంట తెచ్చుకున్న సీసాను తీసి ఒక్కసారిగా పెళ్లి కుమార్తె ముఖంపై యాసిడ్ కుమ్మరించింది.
చిధ్రమైన పెళ్లి కలలు
క్షణాల్లో జరిగిన ఈ దారుణంతో పెళ్లి కుమార్తె నరకయాతన అనుభవిస్తూ కుప్పకూలిపోయింది. ఆమె ఆర్తనాదాలు విని బంధువులు వచ్చేలోపే ముఖం, కళ్లు, మెడ, చేతులు తీవ్రంగా కాలిపోయాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ప్రేమ పిచ్చి.. పగగా మారి..
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు మరియు వరుడు గత ఐదేళ్లుగా ప్రేమించుకున్నట్లు సమాచారం. తన ప్రేమికుడు మరో యువతిని వివాహం చేసుకోవడాన్ని సహించలేక, వారి జీవితాలను నాశనం చేయాలనే పక్కా పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
శిక్ష తప్పదు: నిందితురాలిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
మంగళ మంగళవారమే ఆ కుటుంబంలో మంగళకరమైన వేడుక జరగాల్సింది పోయి, ఒక యువతి స్వార్థం వల్ల ఆ ఇల్లు ఇప్పుడు కన్నీటి సంద్రమైంది.
