జైపూర్లోని ప్రముఖ మోతీ డూంగ్రీ వినాయక ఆలయంలో గణేష్ చతుర్థికి ముందు రోజు నిర్వహించిన సింజారా వేడుకలకు ఊహించని స్థాయిలో భారీగా భక్తులు తరలివచ్చారు.
ముఖ్యంగా పెళ్లి కాని యువతతో పాటు వారి కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ఒక్కరోజే దాదాపు 18 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించినట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ భారీ రద్దీకి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఆలయంలో వినాయకుడికి సమర్పించే సింజారా మెహందీని చేతికి పెట్టుకుంటే పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగి, మంచి వివాహ అవకాశం లభిస్తుందని ఒక సంప్రదాయ విశ్వాసం ఉంది.
అంతేకాదు.. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో పెళ్లి కాని వారికి ఒక ఏడాదిలోపే వివాహం జరుగుతుందని ప్రచారం కావడంతో ఈ విషయం మరింత వేగంగా వైరల్ అయింది. అయితే ఇది కేవలం మతపరమైన విశ్వాసం మాత్రమే.. దీనికి శాస్త్రీయ ఆధారం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.
ఈ ఏడాది ఆలయ నిర్వాహకులు సుమారు 3,500 కిలోల మెహందీని సిద్ధం చేశారు. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో నిర్ణయించిన సమయానికి ముందుగానే మెహందీ ప్రసాదం పంపిణీ ప్రారంభించినట్లు సమాచారం. కేవలం మూడు గంటల్లోనే మొత్తం మెహందీ నిల్వ పూర్తిగా అయిపోయినట్లు తెలుస్తోంది.
భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద పొడవైన క్యూలు, ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మోతీ డూంగ్రీ వినాయక ఆలయంలో మెహందీ ప్రసాదం అందించే సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం కారణంగా సాధారణం కంటే భారీగా భక్తులు తరలివచ్చారు.
మెహందీ చేతికి పెట్టుకుంటే వివాహం జరుగుతుందనేది ఒక విశ్వాసం మాత్రమే.. దానికి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారం లేదని గుర్తుంచుకోవాలి.

Leave a Reply