రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బహ్రోర్ జిల్లాలో, 22 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు బీహార్ రాష్ట్రానికి చెందిన వివేక్ అనే వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి.
తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే చిన్నారిని బలి ఇవ్వాలని అతడు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు.
బీహార్‌లోని ససారాం ప్రాంతానికి చెందిన వివేక్, చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు అజ్మీర్ మీదుగా జైపూర్ వెళ్లి అక్కడి నుంచి షాపురా ప్రాంతానికి వెళ్లినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కోట్‌పుత్లీ-బహ్రోర్ జిల్లాలోని నీమ్రానా ప్రాంతంలో 22 నెలల చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు అతనిపై ఆరోపణలు వచ్చాయి. చిన్నారి ద్విచక్ర వాహనం పైనుంచి కింద పడిపోకుండా ఉండేందుకు, బట్టతో తన దేహానికి కట్టుకుని మరీ తీసుకువెళ్లినట్లు సమాచారం.
బిడ్డతో పాటు వివేక్ నీమ్రానా నుంచి షాజహాన్‌పూర్, బవల్, రేవారీ, ఫరీదాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోసికలాన్ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ బిడ్డను సుమారు 48 గంటల పాటు తన వద్ద ఉంచుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. చిన్నారిని వెతికేందుకు గాలింపు కొనసాగుతుండగా, మధుర ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ పరిస్థితిని అనుమానించి విచారించినట్లు సమాచారం. ఆ తర్వాత చిన్నారిని, వివేక్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా కిడ్నాప్ బాగోతం వెలుగులోకి వచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి పోలీసుల వాహనం నుంచి తప్పించుకునేందుకు వివేక్ ప్రయత్నించినట్లు సమాచారం. టాయిలెట్‌కు వెళ్లాలని చెప్పి వాహనం ఆపించి, ఆ తర్వాత పోలీసులను నెట్టేసి రోడ్డు పక్కన దూకి పారిపోయేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కిందపడటంతో అతని కాలు విరిగినట్లు వార్తలు చెబుతున్నాయి. ఈ కేసులో చిన్నారి కిడ్నాప్, బలి ఇవ్వాలని పథకం పన్నినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply