రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో ఒక వరుడిని ఘోరంగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. యువకుడికి పెళ్లి చేస్తామని నమ్మించిన కొందరు దళారులు అతడిని ఎంతలా ముంచారంటే.. ఆ షాక్ నుండి అతను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. భరత్‌పూర్‌లో నకిలీ పెళ్లిళ్లు (ఫేక్ మ్యారేజెస్) చేసే ఒక ముఠా యాక్టివ్‌గా ఉంది.
ఈ గ్యాంగ్ బాధితుడైన యువకుడిని తమ వలలో దించి మొదట అతని నుండి ఏడు లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత అతను ఊహించని అమ్మాయితో పెళ్లి జరిపించి షాక్ ఇచ్చింది.
పెళ్లి చూపుల్లో యువకుడికి చూపించిన అమ్మాయిని కాకుండా, పెళ్లి పీటలపై మరో అమ్మాయిని కూర్చోబెట్టి ఈ ముఠా మోసానికి పాల్పడింది. రాజస్థానీ సాంప్రదాయం ప్రకారం ముఖానికి ముసుగు (ఘూంఘట్) ఉండటంతో వధువు ముఖం కనిపించకుండానే పెళ్లి తంతు మొత్తం ముగిసిపోయింది. పెళ్లి తర్వాత వధువును అత్తగారింటికి తీసుకువెళ్తుండగా.. దారిలో వరుడికి ఆమెపై అనుమానం వచ్చింది. దీనితో అతను వధువు ముఖం మీదున్న ముసుగు తీసి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
వెంటనే అతను పెళ్లి కుదిర్చిన దళారులను సంప్రదించగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని తీసుకున్న డబ్బులో సగం డబ్బును అక్కడ పారేసి, వధువును తీసుకొని అక్కడి నుండి పరారయ్యారు. ఆ తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నకిలీ వధువుతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసు ఖోహ్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినది. హర్యానాలోని నంగల్ చౌదరి నివాసి అయిన ఫూల్‌చంద్ గుర్జర్ ఫిబ్రవరి 9న ఖోహ్ పోలీస్ స్టేషన్లో నలుగురు వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు. నకిలీ పద్ధతిలో పెళ్లి చేస్తామని నమ్మించి తన వద్ద నుండి రూ. 7 లక్షలు కాజేశారని పేర్కొన్నాడు. ఖోహ్ నివాసి విజన్ గుర్జర్, ఉత్తర ప్రదేశ్‌లోని మథుర నివాసి కర్తార్ గుర్జర్ మరియు ఢిల్లీ పంజాబీ బాగ్ నివాసి రవి ధోబీలు కలిసి తమ గ్రామానికి చెందిన ఒక యువకుడికి పెళ్లి సంబంధం కుదిర్చారని బాధితుడు రిపోర్టులో తెలిపాడు. పెళ్లి చేసినందుకు గానూ వారి నుండి ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు.
నిందితులు యువకుడికి పెళ్లి అయితే చేశారు కానీ పెళ్లికూతురిని మార్చేశారు. మొదట చూపించిన అమ్మాయితో పెళ్లి చేయకుండా వేరే అమ్మాయితో ఏడడుగులు వేయించారు. పెళ్లి ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దారిలో వరుడికి వధువుపై అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అతను వధువు ముసుగు తీసి చూడటంతో షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే ఆ వధువు మొదట తమకు చూపించిన అమ్మాయి కాదు, వేరే అమ్మాయి. నిందితులు పెళ్లి చేసిన ఆ నకిలీ వధువు పేరు నేహా. ఆమె కూడా ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతానికి చెందినదే.
ఈ మోసాన్ని గమనించిన వరుడు వెంటనే దళారులను పిలిపించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకోగా ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. దీనితో పెళ్లి కుదిర్చిన వారు తాము ఫూల్‌చంద్ మరియు వరుడి నుండి తీసుకున్న సొమ్ములో కొన్ని డబ్బులను అక్కడ పడేసి, వధువు నేహాను తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. అప్పుడు తాము మోసపోయామని గ్రహించిన ఫూల్‌చంద్ గుర్జర్ మరియు వరుడు పోలీసుల వద్దకు వెళ్లారు.
పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ నలుగురు నిందితులను వేర్వేరు ప్రాంతాల నుండి ఫిబ్రవరి 14న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. పట్టుబడిన నిందితులంతా ఒక గ్యాంగ్‌గా ఏర్పడి, నకిలీ పద్ధతిలో పెళ్లిళ్లు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను మరింత లోతుగా విచారిస్తే ఇలాంటి మరిన్ని మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply