సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిన్నారి మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. తన ఇంట్లో జరిగే ఒక వివాహ వేడుకకు వెళ్లడం కోసం సెలవు అడిగిన ఆ అబ్బాయి, టీచర్ అడిగిన ప్రశ్నలకు ఎంతో గర్వంగా సమాధానాలు ఇచ్చాడు.
“పెళ్లికి వెళ్లడం నీకు అంత ముఖ్యమా?” అని టీచర్ అడగ్గా.. దానికి ఆ చిన్నారి ఎంతో గంభీరంగా, “అవును, పెళ్లి పత్రికలో నా పేరు వేశారు, అందుకే నేను కచ్చితంగా వెళ్లాలి” అని చెప్పాడు. పెళ్లి పత్రికలో పేరు ఉండటాన్ని ఒక గొప్ప గౌరవంగా భావిస్తూ ఆ అబ్బాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
ఆ తర్వాత టీచర్, “సరే, నువ్వు వెళ్తే చదువు ఏమవుతుంది?” అని అడిగితే.. ఆ బాబు ఏమాత్రం ఆలోచించకుండా, “పుస్తకం ఇచ్చేయండి, అక్కడే చదువుకుంటాను” అని ఎంతో తెలివిగా సమాధానం చెప్పాడు. ఒకవేళ సెలవు ఇవ్వకపోతే ఏం చేస్తావు అని అడిగితే, “అప్పుడు స్కూల్‌కే వచ్చేస్తాను” అని ఆ చిన్నారి చెప్పిన విధానం అతని అమాయకత్వాన్ని, నిజాయితీని చాటుతోంది. పిల్లల ప్రపంచం ఎప్పుడూ ప్రత్యేకం అని ఈ వీడియో మరోసారి నిరూపించింది.
