బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాలోని హర్పూర్ కృష్ణా గ్రామంలో, వివాహ సమయంలో వరకట్న డబ్బు విషయమై తలెత్తిన వివాదం తీవ్ర కలకలం రేపింది.
వినోద్ పాశ్వాన్ కుమార్తె రూపా కుమారికి, రాంపూర్ దయాళ్ గ్రామానికి చెందిన రామ్‌దాస్ పాశ్వాన్ కుమారుడు అనంత్ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి వరుడి తరపు వారు ఊరేగింపుగా (బరాత్) వధువు ఇంటికి చేరుకున్నారు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, మిగిలిన కట్నం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.
ఈ వివాహం కోసం మొత్తం రూ.4 లక్షలు కట్నంగా మాట్లాడుకున్నారని, అందులో ఇప్పటికే రూ.3 లక్షలు చెల్లించామని వధువు తరపు వారు తెలిపారు. మిగిలిన రూ.1 లక్ష తర్వాత ఇచ్చేలా ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే, పెళ్లి రోజే మిగిలిన పూర్తి డబ్బును వెంటనే ఇవ్వాలని వరుడి తరపు వారు పట్టుబట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వధువు తరపు వారు, తక్షణమే రూ.1 లక్ష ఇవ్వలేమని, ప్రస్తుతానికి రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ముదిరింది.
అనంతరం వివాహాన్ని నిలిపివేసి వరుడిని వెనక్కి తీసుకెళ్లేందుకు వరుడి తరపు వారు ప్రయత్నించారని వధువు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి బృందం వెనుదిరిగే పరిస్థితి ఏర్పడటంతో, వధువు బంధువులు మరియు గ్రామస్తులు జోక్యం చేసుకుని వరుడిని, అతని బావమరిదిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే ఈ విషయంపై సక్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు.
గంటల తరబడి జరిగిన చర్చలు, రాజీ ప్రయత్నాల తర్వాత వివాహం జరిపించడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో మరుసటి రోజు ఉదయం మళ్లీ పురోహితుడిని పిలిపించి, పోలీసుల సమక్షంలో వివాహ వేడుకలను పూర్తి చేశారు. వరకట్న వివాదంతో ఆగిపోయే స్థితికి చేరిన వివాహం, పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply