పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు అనంత లోకాలకు.. నాసిక్‌లో రిటైర్డ్ హైకోర్టు జడ్జి కుమార్తె విషాద మరణం

నాసిక్ సమీపంలోని గంగాపూర్ గ్రామం వద్ద ఉన్న ఒక లగ్జరీ రిసార్ట్‌లో పెళ్లి రోజే వధువు అకస్మాత్తుగా మరణించడంతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. ఆదివారం ఉదయం (డిసెంబర్ 28) ఈ ఘోర కలి జరిగింది. ఈ ఘటనపై సర్కార్వాడ పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?
మరణించిన వధువును దీప్శిఖ గోడ్బోలే (29) గా గుర్తించారు. ముంబైలోని దాదర్-మాతుంగ ప్రాంతానికి చెందిన ఈమె, బొంబాయి హైకోర్టు రిటైర్డ్ జడ్జి గిరీష్ గోడ్బోలే కుమార్తె.

ఆమె వివాహం నాసిక్ సమీపంలోని ఒక రిసార్ట్‌లో జరగాల్సి ఉంది. దీనికోసం బంధుమిత్రులందరూ ముంబై నుండి నాసిక్ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో, ఆమె హోటల్ గది నంబర్ 201లో బంధువులతో కలిసి ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆమె మేనత్త డాక్టర్ స్వాతి బాపట్ వెంటనే ప్రథమ చికిత్స అందించి, శ్రీ గురూజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

విషాదంలో మునిగిన కుటుంబం
వేడుక కోసం కళ్యాణ మండపం ముస్తాబైంది, చేతులకు మెహందీ మెరుస్తోంది, సంగీత్ కార్యక్రమం కూడా ముగిసింది. తీరా పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

మరణానికి కారణం: పెళ్లి పనుల ఒత్తిడి మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల తాను అసౌకర్యంగా ఉన్నట్లు దీప్శిఖ అంతకుముందు బంధువులతో చెప్పింది. అయితే దానిని సాధారణ అలసటగా భావించి ఆమె పట్టించుకోలేదు. ఉదయం పెళ్లికి ముస్తాబవుతుండగా ప్రాణాలు విడిచింది.

కుటుంబ సభ్యులు, బంధువుల దీవెనల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన దీప్శిఖ, అకాల మరణం చెందడంతో గోడ్బోలే కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. ముంబైలోని ఆమె నివాస ప్రాంతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి ఇంట్లో జరగాల్సిన వేడుక.. అంతులేని శోకంగా మారిపోయింది.


Posted

in

by

Tags: