ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న ‘స్పర్శ్ లాన్’ (Sparsh Lawn) వివాహ మండపంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో, అతిథులకు కుక్కకు ఆహారం పెట్టే గిన్నెలో భోజనం వడ్డించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటన అక్కడున్న వరుడి కుటుంబ సభ్యులు, అతిథులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ మండపంలో పెళ్లి విందు జరుగుతున్న సమయంలో అతిథులకు ఆహారం వడ్డిస్తున్నారు. ఆ సమయంలో ఆహారం ఉంచిన గిన్నెను చూసిన అతిథులు ఒక్కసారిగా షాక్కు గురై నిరసన వ్యక్తం చేశారు. అది కుక్కలకు ఆహారం పెట్టేందుకు ఉపయోగించే గిన్నె అని వారు ఆరోపించారు.
దీంతో మండపం సిబ్బంది తమ పొరపాటును అంగీకరించినట్లు సమాచారం. ఆ గిన్నె పొరపాటున వడ్డించే ఏర్పాట్లలోకి వచ్చిందని వారు వివరణ ఇచ్చారు. ఇలాంటి నిర్లక్ష్యం అతిథుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పెళ్లికి వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనను అతిథులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వివాహ మండపాల్లో ఆహారం వడ్డించే ఏర్పాట్లు, పరిశుభ్రత ప్రమాణాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a Reply