పెళ్లి సంబంధం కోసం వచ్చిన ఒక యువకుడి ఆర్థిక నేపథ్యాన్ని తనిఖీ చేయడానికి వధువు తండ్రి అనుసరించిన ఒక వింత పద్ధతి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఏడాదికి 38 లక్షల రూపాయల ఆదాయం ఉన్న తనకు, ఒక ఉన్నతాధికారికి జరిగే ‘బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్’ కంటే కఠినమైన తనిఖీలు ఎదురయ్యాయని ఆ యువకుడు వాపోయాడు.
గత ఆరు నెలలుగా సరైన భాగస్వామి కోసం వెతుకుతున్న తాను, ఆఫీసులోని హెచ్.ఆర్ (HR) ఇంటర్వ్యూలను మించిపోయిన ఈ ప్రశ్నలతో విసిగిపోయానని, అసలు పెళ్లి అనే ఆలోచననే వదిలేయాలని అనుకుంటున్నట్లు ఆయన ‘గ్రేప్‌వైన్’ (Grapevine) అనే ప్లాట్ఫామ్లో రాసుకొచ్చాడు. ఇద్దరి వ్యక్తుల మధ్య పొంతన కంటే ఆర్థిక లాభనష్టాలు, తనిఖీలకు ప్రాధాన్యత ఇచ్చే ఇటువంటి సంబంధాలు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు.
ఇందిరానగర్‌లోని ఒక కేఫ్ లో జరిగిన భేటీలో అమ్మాయి తండ్రి అనూహ్యంగా యువకుడి ఫోన్ అడిగారు. ఏదో సరదాగా అడుగుతున్నారని భావించి ఫోన్ ఇచ్చిన ఆ యువకుడికి పెద్ద షాక్ తగిలింది. ఆ పెద్దాయన నేరుగా యువకుడి సిబిల్ (CIBIL) స్కోర్‌ను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. యువకుడికి ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉన్నాయా అని నిర్ధారించుకోవడానికే ఈ ‘తనిఖీ’ చేస్తున్నట్లు ఆయన చాలా గంభీరంగా చెప్పారు.
పెళ్లిని కేవలం ఒక ఆర్థిక లావాదేవీలా చూసే ఇటువంటి ధోరణులపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఎదుటివారి ప్రైవసీని గౌరవించని ఇటువంటి పద్ధతులు ‘అరేంజ్డ్ మ్యారేజ్’ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భద్రత చూసుకోవడం మంచిదే అయినప్పటికీ, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కొలవడానికి సిబిల్ స్కోర్ చూడటం అనేది హద్దులు దాటడమేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
