లివ్-ఇన్ రిలేషన్షిప్కు సంబంధించిన ఓ కేసులో ఢిల్లీ హైకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో కలిసి జీవించాలని (లివ్-ఇన్) నిర్ణయించుకుంటే, వారి వ్యక్తిగత జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు లేదా బంధువులు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేసింది.
ముఖ్యంగా ఇద్దరూ మేజర్లు (వయసు వచ్చినవారు) అయితే, తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని వారితో కలిసి జీవించే పూర్తి హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ హైకోర్టులో సుమారు 30 ఏళ్ల వయసున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. తాము కొంతకాలంగా కలిసి జీవిస్తున్నామని, భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని వారు పేర్కొన్నారు. అయితే యువతి తండ్రి, సోదరుడు వీరి బంధాన్ని వ్యతిరేకిస్తూ తమను నిరంతరం బెదిరిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ బెనర్జీ.. మేజర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ అభీష్టం మేరకు జీవిత భాగస్వామిని ఎంచుకుని కలిసి జీవించే పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నారని పేర్కొన్నారు. రంగు, కులం, మతం, సమాజం లేదా నమ్మకాల పేరుతో వారి వ్యక్తిగత నిర్ణయాలను ఏ శక్తీ నియంత్రించలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమాజంలోని కొన్ని మూఢాభిప్రాయాలు లేదా పట్టింపుల ఆధారంగా వ్యక్తుల ప్రాథమిక హక్కులను కాలరాయలేమని న్యాయమూర్తి గుర్తుచేశారు.
అంతేకాకుండా, ఇద్దరు వ్యక్తులు తమ స్వచ్ఛంద ఆమోదంతో బాధ్యతాయుతంగా లివ్-ఇన్ బంధంలో ఉండాలని నిర్ణయించుకుంటే.. తల్లిదండ్రులైనా, బంధువులైనా ఆ నిర్ణయానికి అడ్డుపడే హక్కు లేదని కోర్టు తేల్చిచెప్పింది. సదరు జంటకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ.. వ్యక్తిగత స్వేచ్ఛ, భాగస్వామి ఎంపిక హక్కుకు చట్టపరమైన రక్షణ ఎంతో ప్రాధాన్యమైనదని ఢిల్లీ హైకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది.

Leave a Reply