బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా, ఖుర్జా ప్రాంతంలోని కలందర్గఢీ గ్రామంలో జరిగిన సంచలన డబుల్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్య సనా (21), తండ్రి రియాజుద్దీన్ (50)లను కుమారుడు ముబీన్ కాల్చి చంపిన ఈ ఘటన వెనుక అక్రమ సంబంధం, అనుమానం మరియు కుటుంబ కలహాల చీకటి కోణాలు ఉన్నాయి.
ల్యాప్‌టాప్‌లో బయటపడ్డ నిజాలు: నిందితుడు ముబీన్ తన భార్య, తండ్రిపై చాలా కాలంగా అనుమానంతో ఉన్నాడు. వారి అక్రమ సంబంధాన్ని ఆధారాలతో సహా నిరూపించుకోవడానికి, ముబీన్ తన భార్య సనా మొబైల్‌ను తన ల్యాప్‌టాప్‌లో ‘వాట్సాప్ వెబ్’ ద్వారా లాగిన్ చేశాడు. వారి మధ్య జరిగే ప్రతి చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను అతను నిశితంగా గమనించేవాడు. ఈ డిజిటల్ ఆధారాలే ఇప్పుడు పోలీసులకు కీలక సాక్ష్యాలుగా మారాయి.
కుటుంబంలో మొదలైన చిచ్చు: 14 ఫిబ్రవరి 2025న ముబీన్-సనాల వివాహం జరిగింది. పెళ్లైన ఏడు నెలలకే (సెప్టెంబర్ 2025) సనా, మామ రియాజుద్దీన్ మధ్య చొరవ పెరిగింది. ఈ విషయాన్ని మొదట గమనించిన ముబీన్ తల్లి కిశ్వర్, కొడుకుకు తెలియజేయడంతో ఇంట్లో నిత్యం గొడవలు మొదలయ్యాయి.
అడ్డుతగిలిన మామ, దారికి వచ్చిన కోడలు: అక్టోబర్ నెలలో వారిని అభ్యంతరకర స్థితిలో చూసిన ముబీన్, సనాను పుట్టింటికి పంపించి, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే, పరువు పోతుందనే భయంతో సనా కుటుంబీకులు క్షమాపణలు కోరగా, మరోవైపు తండ్రి రియాజుద్దీన్ తన కుమారుడిపై ఒత్తిడి తెచ్చి మళ్లీ కోడలిని ఇంటికి పిలిపించాడు. సనాకు ఖరీదైన వస్తువులు, నగలు బహుమతులుగా ఇస్తూ రియాజుద్దీన్ ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. ఇవన్నీ తెలిసినా, ఇంటిని తన పేరు మీద మార్చుకుంటానని రియాజుద్దీన్ బెదిరించడంతో ముబీన్ తల్లి మౌనంగా ఉండిపోయింది.
నేనే చంపేశాను: మే 10న సనా ఒక మగబిడ్డకు జన్మనివ్వగా, ఆ బిడ్డ తనది కాదని, తండ్రి రియాజుద్దీన్ సంతానమని ముబీన్ ఆరోపించడం వివాదాన్ని తారాస్థాయికి చేర్చింది. ఆదివారం ఉదయం సనా కుటుంబ సభ్యులు పంచాయతీ చేసి వెళ్లిన రెండు గంటలకే, ముబీన్ తన తండ్రి లైసెన్స్డ్ పిస్టల్‌తో ఇద్దరినీ కాల్చి చంపాడు. అనంతరం తనే పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. అక్రమ సంబంధాల పర్యవసానంగా ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించి, ఒక నిండు సంసారం నాశనమైంది.
