వాషింగ్టన్: 33 ఏళ్ల షార్లెట్ బోవర్స్ (Charlotte Bowers) కు ఆ రాత్రి మిగిలిన రోజుల్లాగే సాధారణంగా గడిచింది. న్యూయార్క్‌లో రోజంతా బిజీగా గడిపి గాఢ నిద్రలో ఉన్న ఆమె, తమ ప్రాణాలకే ముప్పు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. తాము సురక్షితంగా బాత్రూమ్లో పెట్టిన ‘ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్’ ఒక బాంబులా మారుతుందని ఎవరు ఊహిస్తారు?
ఆ రాత్రి ఏం జరిగింది? ఎనిమిది నెలలుగా వాడుతున్న అదే టూత్‌బ్రష్‌ను షార్లెట్ ఎప్పటిలాగే బాత్రూమ్ గ్లాస్ స్టాండ్‌లో పెట్టింది. “అదృష్టవశాత్తూ ఆ రాత్రి అది ఛార్జింగ్‌లో లేదు, పైగా నేను ఎప్పుడూ దానిని తడి లేకుండా పొడిగా ఉంచుతాను” అని ఆమె తెలిపింది. అయినప్పటికీ, అర్ధరాత్రి ఆ బ్రష్ అకస్మాత్తుగా పేలిపోయింది. దాని నుండి వచ్చిన మంటల వల్ల బాత్రూమ్ గోడలు నల్లగా మారిపోయాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కరిగిపోయింది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ బ్రష్ ఉంచిన గ్లాస్ స్టాండ్ స్టీల్ ఫ్రేమ్ మంటలు ఇతర చోట్లకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సంస్థ నిర్లక్ష్యం: ఈ ప్రమాదం వల్ల బాత్రూమ్ గోడలను బాగు చేయడానికి సుమారు 267 డాలర్లు (సుమారు ₹22,000) ఖర్చయింది. అయితే, సదరు కంపెనీ కేవలం 46 డాలర్లు (కొత్త బ్రష్ కొనుక్కోవడానికి) మాత్రమే ఇస్తామని చెప్పడం వివాదాస్పదమైంది. “నేను వేలల్లో నష్టపరిహారం అడగడం లేదు, జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తే చాలు. కానీ మనుషుల ప్రాణాలకు ఆ సంస్థ ఇచ్చే విలువ ఇంతేనా?” అని షార్లెట్ ప్రశ్నిస్తోంది.
