తమిళనాడులోని తిరుచ్చిలో జంతు హింసకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పొరుగువారితో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన 28 ఏళ్ల మహిళ, వీధి కుక్కకు పుట్టిన రెండు పసి కుక్కపిల్లలను గోడకేసి కొట్టి చంపి తన కసి తీర్చుకుంది.
పొరుగున ఉండే మహిళ తన మూడేళ్ల కొడుకుపై రాయి విసరడంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు జంతు హింస నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. తిరుచ్చికి చెందిన జె. మీనాక్షి మిశ్రా, జి. భువనేశ్వరి (30) ఇద్దరూ పొరుగువారు. గత ఏడాది కాలంగా వీరి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో వీరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో భువనేశ్వరి విసిరిన రాయి మీనాక్షి మూడేళ్ల కుమారుడికి తగిలింది.
గాయపడిన కొడుకును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన మీనాక్షి, మూడు గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటికే ఆవేశంతో ఉన్న ఆమె, తన ఇంటి బయట తిరుగుతున్న చిన్న కుక్కపిల్లలను చూసి తట్టుకోలేకపోయింది. వాటిని పట్టుకుని గోడకేసి బలంగా కొట్టింది. ఈ దృశ్యాలన్నీ సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.
జంతు ప్రేమికుల ఆగ్రహం
పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) ఉపాధ్యక్షుడు అజయ్ భరత్ ఫిర్యాదు మేరకు జీయాపురం పోలీసులు మీనాక్షిపై కేసు నమోదు చేశారు. అజయ్ మాట్లాడుతూ.. “మార్చి 4న మీనాక్షి 3 నుండి 4 కుక్కపిల్లలను గోడకేసి కొట్టి చంపింది. ఆమె గతంలో కూడా జంతువులను చంపి ప్లాస్టిక్ కవర్లలో కట్టి చెట్టుకు వేలాడదీసేదని మాకు సిసిటివి ఆధారాలు దొరికాయి” అని ఆరోపించారు.
మరోవైపు, మీనాక్షి భర్త జై గణేష్ కూడా తమ కుమారుడిని గాయపరిచినందుకు భువనేశ్వరిపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు భువనేశ్వరిని కూడా అరెస్ట్ చేశారు.

Leave a Reply