న్యూఢిల్లీ: భారతదేశంలోని రైతులు ఎన్నో ఏళ్లుగా పనికిరాని మొక్కగా భావించి, కేవలం అడవి జంతువులు పొలాల్లోకి రాకుండా కంచెలా (బాడ్‌గా) నాటిన ఒక మొక్క.. ఈరోజు వారి తలరాతనే మార్చేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బీబీసీ’ (BBC) నివేదిక ప్రకారం.. ఈ మొక్క పేరు ‘అగావే’ (Agave).
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ మద్యం ‘టకీలా’ (Tequila) మరియు ‘మెజ్‌కల్’లను ఈ అగావే మొక్క నుండే తయారు చేస్తారు. ఇప్పుడు భారతీయ మద్య తయారీ కంపెనీలు ఈ అగావే మొక్కలను రైతుల నుండి భారీ ధరలకు కొనుగోలు చేస్తుండటంతో, స్థానిక ప్రజలు దీనిని ‘బ్లూ గోల్డ్’ (నీలాల బంగారం) అని పిలుస్తున్నారు.
దక్కన్ పీఠభూమి ప్రాంతంలో టమోటాలు, వేరుశనగ పండించే ఎం. వెంకటేష్ అనే రైతు మాట్లాడుతూ.. 2010లో మొదటిసారిగా కొందరు వ్యాపారస్థులు ఈ మొక్క కోసం తన వద్దకు వచ్చారని చెప్పారు. అంతకుముందు వరకు రైతులు దీనిని ఒక పనికిరాని అడవి పొదగా భావించేవారు. కానీ ఆ తర్వాతే తెలిసింది.. ప్రపంచవ్యాప్తంగా టకీలా తయారు చేసే మొక్కల కుటుంబానికి (ప్లాంట్ ఫ్యామిలీ) చెందినదే ఈ అగావే అని. నేడు వెంకటేష్ ఒక్కరే కాదు, తన చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలోని డజన్ల కొద్దీ గ్రామాల రైతుల నుండి ఈ అడవి అగావేను సేకరించి పెద్ద పెద్ద కంపెనీలకు సరఫరా చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
24 గంటల డెడ్‌లైన్ – తయారీ వెనుక పెద్ద కష్టం:
ఈ అగావే మొక్క నుండి మద్యం తయారు చేయడం అంత సులువైన పని కాదు. ‘మాయా పిస్తోలా అగావేపురా’ (Maya Pistola Agavepura) కంపెనీ వ్యవస్థాపకుడు రక్షయ్ ధారీవాల్ మాట్లాడుతూ.. ఈ వ్యాపారంలో ‘సమయం’ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. అగావే మొక్కకున్న ముళ్ల ఆకులను కత్తిరించిన తర్వాత మధ్యలో మిగిలే గుండ్రటి భాగాన్ని ‘పీన్యా’ (Piña – హార్ట్) అని పిలుస్తారు. దీనిలోనే అసలైన షుగర్ (చక్కెర శాతం) ఉంటుంది. మొక్కను కోసిన 24 గంటల లోపే ఈ భాగాన్ని ఫ్యాక్టరీలోని ప్రెజర్ కుక్కర్ల వద్దకు చేర్చాల్సి ఉంటుంది. కాస్త ఆలస్యమైనా సరే, దానిలోని షుగర్ కుళ్ళిపోయి, టేస్ట్ పూర్తిగా పాడైపోతుంది.
కమర్షియల్ సాగు లేకపోవడమే పెద్ద సమస్య:
భారతదేశంలో ప్రస్తుతానికి ఈ అగావే మొక్కల సాగు ఇంకా క్రమబద్ధమైన పద్ధతిలో (Organized Farming) ప్రారంభం కాలేదు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో అడవుల్లో, పొలాల గట్లపై ఎక్కడ పడితే అక్కడ మొలిచే ఈ మొక్కలను వెతికి మరీ ఫ్యాక్టరీలకు తీసుకురావాల్సి వస్తోంది.
మొక్క తయారు కావడానికి 9 నుండి 13 ఏళ్లు:
ఒక అగావే మొక్క పూర్తిగా పెరిగి దిగుబడికి సిద్ధం కావడానికి 9 నుండి 13 సంవత్సరాల సుదీర్ఘ సమయం పడుతుంది. భారతదేశంలో అగావే ఆధారిత మద్యం మార్కెట్ ప్రతి సంవత్సరం 31% వేగంతో దూసుకుపోతోంది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ‘విస్కీ’ మార్కెట్‌ను పూర్తిగా రీప్లేస్ చేయలేకపోయినప్పటికీ.. ప్రీమియం మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన, బలమైన గుర్తింపును మాత్రం సొంతం చేసుకుంటోంది.

Leave a Reply