ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ముస్సోరీలో, ఢిల్లీకి చెందిన ఒక యువతి అర్ధరాత్రి మద్యం మత్తులో చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది.
ఢిల్లీ నుండి తన స్నేహితులతో కలిసి ముస్సోరీకి విహారయాత్రకు వచ్చిన ఆ యువతి, మద్యం సేవించింది. జూలై 5న తెల్లవారుజామున మత్తులో తన స్నేహితులతోనే తీవ్ర వాగ్వాదానికి దిగి, బహిరంగ ప్రదేశంలో కేకలు వేస్తూ హంగామా సృష్టించింది. ఆమె ప్రవర్తనను అదుపు చేయలేక స్నేహితులు వెంటనే ఎమర్జెన్సీ నంబర్ ‘డయల్-112’కు కాల్ చేశారు.
సమాచారం అందుకున్న ‘చీతా’ విభాగం పోలీసులు లైబ్రరీ చౌక్ కూడలికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు వాదులాడుకోవడం చూశారు. ఆ సమయంలో ఆ యువతి ఒక పర్యాటకుని వైపు చూస్తూ, “నీ వేళ్లు విరగ్గొడతాను” అని హిందీలో కోపంగా అరుస్తూ బెదిరించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, పోలీసులు ఆ నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీస్ స్టేషన్ బయట కూడా ఆ యువతి రచ్చ ఆగలేదు. అక్కడున్న స్నేహితులను, పోలీసు అధికారులను ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలంతో దూషించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ఉన్న ఆమెను శాంతింపజేయడానికి మహిళా పోలీసులతో సహా అధికారులు చాలా ప్రయత్నించారని, కానీ ఆమె చాలా మొరటుగా ప్రవర్తించిందని ముస్సోరీ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు.
అర్ధరాత్రి సమయం కావడంతో, ఒక మహిళా నిందితురాలు ఉండటంతో పోలీసులు వెంటనే కఠిన చర్యలేవీ తీసుకోలేదు. తెల్లవారే వరకు వారిని స్టేషన్లోనే ఉంచి, ఆమెకు మత్తు దిగే వరకు సమయం ఇచ్చారు. మత్తు పూర్తిగా దిగిన తర్వాత, ఆ నలుగురు పర్యాటకులు తమ తప్పును తెలుసుకుని పోలీసులకు క్షమాపణలు చెప్పారు. పోలీసులు వారికి తగిన సూచనలు, హెచ్చరికలు జారీ చేసి పంపించివేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందనప్పటికీ, పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు.
