రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు లేదా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని ఆపితే, పౌరుడిగా మీకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. యూనిఫాంలో ఉన్న అధికారి అడిగితే పత్రాలు చూపించాల్సిన బాధ్యత మనపై ఉన్నప్పటికీ, పోలీసులు కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
తాళం తీయడం చట్ట విరుద్ధం
వాహన తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులు లేదా లోకల్ పోలీసులు మీ వాహనం తాళాన్ని బలవంతంగా లాక్కోవడం చట్టవిరుద్ధం. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఏ అధికారికి కూడా వాహనం ఇగ్నిషన్ నుండి తాళం తీసే అధికారం లేదు. ఇది మీ వ్యక్తిగత ఆస్తిపై చొరబాటుగా పరిగణించబడుతుంది. అలాగే, టైర్లలో గాలి తీసేయడం కూడా పోలీసుల పరిధిలోకి రాదు. ఇలాంటి సందర్భాల్లో సదరు అధికారి పేరు, బ్యాడ్జ్ నంబర్ నోట్ చేసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
అరెస్ట్ నిబంధనలు
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను సుప్రీంకోర్టు (డి.కె. బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్) స్పష్టం చేసింది:
- మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటే ‘అరెస్ట్ మెమో’ సిద్ధం చేయమని అడిగే హక్కు మీకు ఉంది. అందులో అరెస్ట్ సమయం, కారణం ఉండాలి.
- మీ బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించడం పోలీసుల బాధ్యత.
- మహిళల అరెస్ట్: సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు మహిళలను అరెస్ట్ చేయకూడదు. అత్యవసరమైతే మెజిస్ట్రేట్ అనుమతి మరియు మహిళా పోలీసుల సమక్షం తప్పనిసరి.
ఎఫ్.ఐ.ఆర్ (FIR) హక్కు
నేరం జరిగినప్పుడు ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు నిరాకరిస్తే, ‘జీరో ఎఫ్.ఐ.ఆర్’ కింద ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. అధికార పరిధి పేరుతో ఫిర్యాదును తిరస్కరించే హక్కు వారికి లేదు. అలాగే, ఎఫ్.ఐ.ఆర్ కాపీని ఉచితంగా పొందే హక్కు మీకు ఉంది. దీని కోసం డబ్బులు అడగడం అవినీతి కిందకు వస్తుంది.
జరిమానా ఎవరు విధించాలి?
వాహన తనిఖీల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) లేదా అంతకంటే పైస్థాయి అధికారులకు మాత్రమే జరిమానా విధించే అధికారం ఉంటుంది. కానిస్టేబుళ్లు కేవలం పత్రాల తనిఖీలో సహాయం చేయగలరు కానీ, చలానా రాసే అధికారం వారికి లేదు.
డిజిటల్ పత్రాలు చెల్లుతాయి
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, DigiLocker లేదా mParivahan యాప్‌లలో చూపించే డిజిటల్ పత్రాలను అసలు పత్రాలుగానే పరిగణించాలి. పత్రాలు లేనంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉండదు.
