పోలీస్ యూనిఫాంలో తిరుగుతున్న యువతీ-యువకులు.. ఎక్కడి డ్యూటీ అని అడిగితే ‘జూ పార్కు’లో అని సమాధానం!

లక్నో: భుజాలపై మూడు నక్షత్రాలు, ఇస్త్రీ చేసిన ఖాకీ దుస్తులు, మెరిసే లెదర్ బూట్లు.. లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో ఈ యువతీ-యువకులు ఎంతో హుందాగా పోలీసు అధికారుల మాదిరిగా తిరుగుతున్నారు. వారిని చూసిన ప్రయాణికులు అతి చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించారని చర్చించుకున్నారు. కానీ, అక్కడి పోలీసులకు వారిపై అనుమానం రావడంతో అసలు బండారం బయటపడింది.

ఏం జరిగింది? చార్‌బాగ్ స్టేషన్ వద్ద గస్తీ తిరుగుతున్న జీఆర్పీ (GRP) పోలీసులకు, పోలీసు యూనిఫాం వేసుకున్న ఆ యువతీ-యువకుల ప్రవర్తనలో ఏదో తేడాగా అనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాము ‘డిజిపి కార్యాలయం’ ఆదేశాల మేరకు లక్నో జూ పార్కులో డ్యూటీలో చేరడానికి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఆ వయసులో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిగా ఉండటంపై పోలీసులకు అనుమానం బలపడింది.

ఫేక్ ఇన్‌స్పెక్టర్ల కథ: పోలీసుల విచారణలో వారు కౌశాంబి జిల్లాకు చెందిన అజయ్ ప్రకాష్ (21), కళావతి (21) అని తేలింది. అజయ్ బి.ఎస్.సి పాస్ కాగా, కళావతి బి.ఎ పాస్ అయ్యారు. కౌశాంబిలో కొందరు వ్యక్తులు పోలీసుల్లో ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వీరి దగ్గర నుండి భారీగా డబ్బు వసూలు చేశారు. అజయ్ నుండి ఐదు లక్షలు, కళావతి నుండి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని, ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే వీరికి యూనిఫామ్ ఇచ్చి, లక్నోలోని జూ పార్కులో పోస్టింగ్ వచ్చిందని నమ్మించి పంపారు.

కేసు నమోదు: యూనిఫామ్, బ్యాడ్జ్, బెల్టు మరియు స్టార్లతో అలంకరించబడిన ఆ నకిలీ ఇన్‌స్పెక్టర్లు, డ్యూటీ కోసం రిక్షాలో వెళ్తుండగా పట్టుబడ్డారు. ఈ విషయంపై జీఆర్పీ సిఓ అమితా సింగ్ మాట్లాడుతూ, నకిలీ పద్ధతుల్లో పోలీసు యూనిఫాం ధరించి మోసానికి పాల్పడినందుకు వారిద్దరిపై కేసు నమోదు చేశామని, అలాగే వారిని మోసం చేసిన ముఠా కోసం గాలిస్తున్నామని తెలిపారు.


Posted

in

by

Tags: