మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, 2022 సెప్టెంబర్ నెలలో అదృశ్యమైన తన భర్తను వెతికిపెట్టాలని కోరుతూ నవహర్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అయితే, పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేయడానికి నిరాకరించడమే కాకుండా, ఆమెతో వాగ్వాదానికి దిగి దాడి చేశారని, ఆపై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి మానసిక ఆసుపత్రికి తరలించారని ఆ మహిళ ఆరోపించింది.
ఆ మహిళ అరెస్ట్ అయిన మరుసటి రోజే, సమీపంలోని నది ప్రాంతంలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. ఆ మహిళ భర్త సోదరుడు (మరిది) ఆ మృతదేహాన్ని చూసి, అది తన అన్నయ్యదేనని గుర్తించాడు. దీని ఆధారంగా, భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ, ఆ మృతదేహం తన భర్తది కాదని ఆమె మొదటినుంచీ వాదిస్తూనే ఉంది.
నిజానిజాలు తెలుసుకునేందుకు, భర్త సోదరుడు మరియు కొడుకు డీఎన్ఏ నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. సుమారు 4 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాజాగా వెలువడిన డీఎన్ఏ పరీక్ష నివేదిక ఈ కేసును కొత్త మలుపు తిప్పింది. నదిలో దొరికిన మృతదేహం ఆ మహిళ భర్తది కాదని ఆ రిపోర్టు ద్వారా అధికారికంగా నిర్ధారణ అయింది.
మొదటి నుంచి తన భర్త బతికే ఉన్నాడని ఆ మహిళ చెబుతున్న మాట ఇప్పుడు నిజమని తేలింది. దీంతో అదృశ్యమైన తన భర్తను వెతికి అప్పగించాలని, తప్పుగా మృతదేహాన్ని గుర్తించిన మరిది, తోటికోడలుతో పాటు తనకు అన్యాయం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ ఘటన ప్రస్తుతం మహారాష్ట్రలో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply