కళ్లలో కనిపించే కొన్ని చిన్నపాటి మార్పుల ఆధారంగా మెదడులో కణితి (బ్రెయిన్ ట్యూమర్) ఉందేమో ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా చూపు మసకబారినప్పుడు చాలామంది కొత్త కళ్లద్దాలు మార్చుకుంటే సరిపోతుందని భావిస్తారు. అయితే అన్ని కంటి సమస్యలు కేవలం కళ్లకు మాత్రమే సంబంధించినవి కావు. కళ్లు నిజానికి మెదడు పొడిగింపుగానే పనిచేస్తాయి కాబట్టి, మెదడులో పెరిగే ఒత్తిడి లేదా కణితుల ప్రభావం తొలుత కళ్లపైనే సంకేతాలుగా బయటపడుతుంది.
మన కళ్లు చూసే దృశ్యాలను ఆప్టిక్ నెర్వ్ (దృష్టి నరం) ద్వారానే మెదడుకు సంకేతాలుగా చేరవేస్తాయి. ఈ సంకేతాలు వెళ్లే మార్గంలో కణితి ఏర్పడినా లేదా మెదడులో అంతర్గత ఒత్తిడి పెరిగినా వెంటనే దృష్టి లోపాలు తలెత్తుతాయి. పిట్యూటరీ అడెనోమా, క్రానియోఫారింజియోమా, మెనింజియోమా, ఆప్టిక్ పాత్వే గ్లియోమా వంటి కొన్ని నిర్దిష్ట బ్రెయిన్ ట్యూమర్లు ఆప్టిక్ నరాలను, హార్మోన్ గ్రంథులను నేరుగా దెబ్బతీసి క్రమంగా కంటిచూపు కోల్పోయేలా చేస్తాయి.
మెదడు కణితికి సంబంధించిన మొదటి ప్రధాన లక్షణం ‘డబుల్ విజన్’ (ఒకే వస్తువు రెండుగా కనిపించడం). ఏదైనా వస్తువు లేదా మనుషుల ముఖం అకస్మాత్తుగా రెండుగా కనిపించడం, ఆ సమస్య నిరంతరం కొనసాగడం అనేది మెదడులో ఒత్తిడి పెరగడానికి సంకేతం. మెదడులోని ఒత్తిడి కంటి కదలికలను నియంత్రించే నరాలను ప్రభావితం చేయడంతో, రెండు కళ్ల సమన్వయం దెబ్బతిని ఒకే వస్తువు రెండేసి చిత్రాలుగా కనిపిస్తుంది.
రెండవ లక్షణం కనుగుడ్లను సులభంగా కదల్చలేకపోవడం. సాధారణంగా కళ్లు అన్ని దిశల్లోనూ సాఫీగా కదులుతాయి; కానీ ఏదైనా ఒక వైపునకు చూడటంలో ఇబ్బంది కలగడం లేదా కంటిని కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం జరిగితే, అది కంటి నరాలపై కణితి ఒత్తిడి పెంచుతోందనడానికి సంకేతం కావచ్చు. ఇది కంటి కండరాల సహజ కదలికలను అడ్డుకుని చూపును స్తంభింపజేస్తుంది.
మూడవ లక్షణం రంగులను గుర్తించడంలో మార్పు రావడం మరియు అకస్మాత్తుగా దృష్టి మందగించడం. నీలం, ఊదా వంటి రంగుల మధ్య తేడాలను గుర్తించలేకపోవడం లేదా వెలుతురును సరిగ్గా గ్రహించలేకపోవడం వంటి సమస్యలు మెదడు వెనుక భాగంలోని ‘దృష్టి కేంద్రం’ (విజువల్ కార్టెక్స్)లో కణితి ఏర్పడి ఉండవచ్చని సూచిస్తాయి.
నాలుగవ లక్షణం పెరిఫెరల్ విజన్ లోపం (పరిధీయ దృష్టి లోపం), అంటే ఎదురుగా ఉన్నవి మాత్రమే కనిపించి పక్కన ఉన్న దృశ్యాలు కనుమరుగైపోవడం (టన్నెల్ విజన్). కళ్లలో ఇలాంటి ఆకస్మిక మార్పులు కనిపిస్తే వాటిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా, సొంత వైద్యం లేదా కేవలం కళ్లద్దాలతో సరిపెట్టకుండా వెంటనే న్యూరాలజిస్ట్ లేదా నేత్ర వైద్యుడిని సంప్రదించి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రాణరక్షకం.
