మీరు EMI ద్వారా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసి, సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే, బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు మీ ఫోన్‌ను పాక్షికంగా లాక్ చేసే అవకాశం ఉంది. ఈ వివాదాస్పద అంశంపై సుదీర్ఘ చర్చల తర్వాత, ఆర్బిఐ ఇప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఆర్బిఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నోటీసు తప్పనిసరి: వినియోగదారుడు వస్తువుల కోసం తీసుకున్న రుణాన్ని 60 రోజులకు పైగా చెల్లించకపోతే, బ్యాంకులు చర్యలు తీసుకోవచ్చు. అయితే, చర్య తీసుకునే ముందు కస్టమర్‌కు ఖచ్చితంగా నోటీసు ఇవ్వాలి.
- 21 రోజుల సమయం: నోటీసు ఇచ్చిన తర్వాత కూడా రుణాన్ని చెల్లించకపోతే, మరో 21 రోజుల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే ఫోన్ ఫంక్షనాలిటీపై ఆంక్షలు విధించవచ్చు.
ఫోన్ పూర్తిగా లాక్ అవుతుందా?
లేదు. బ్యాంకులు ఫోన్‌ను పూర్తిగా లాక్ చేయడానికి వీల్లేదు. కేవలం కొన్ని పరిమిత సేవలను మాత్రమే నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం, ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ SOS మరియు ప్రభుత్వ ప్రజా భద్రతా సమాచారం (Public Safety Alerts) వంటి అత్యవసర సేవలను ఏ కారణం చేతనూ ఆపకూడదని ఆర్బిఐ స్పష్టం చేసింది.
పెనాల్టీ వసూలు..
ఒకవేళ కస్టమర్ బకాయిలను చెల్లించినట్లయితే, తర్వాతి ఒక గంటలోపే ఫోన్‌పై ఉన్న ఆంక్షలను తొలగించాలి. ఒకవేళ తొలగించడంలో ఆలస్యం జరిగితే, బాధిత కస్టమర్‌కు గంటకు రూ. 250 చొప్పున బ్యాంకులు వడ్డీ/నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
రుణ వసూలు ఏజెంట్లపై ఆంక్షలు..
రుణ వసూలు ప్రక్రియలో ఏజెంట్లు వినియోగదారులను దూషించడం, సోషల్ మీడియాలో వారి వ్యక్తిగత వివరాలను పంచుకోవడం లేదా బెదిరించడం వంటి పనులకు పాల్పడకూడదు. అన్ని ఫోన్ కాల్‌లను ఖచ్చితంగా రికార్డ్ చేయాలని ఆర్బిఐ ఆదేశించింది.
