కేరళలోని త్రిసూర్‌లో రద్దీగా ఉండే బస్టాండ్‌లో, విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులపై ఓ యువకుడు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
నవంబర్ 19 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో త్రిసూర్ నార్త్ బస్టాండ్‌లో ప్రైవేట్ బస్సు సిబ్బందికి, ఇద్దరు యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అక్కడికి వచ్చిన సివిల్ పోలీస్ అధికారి ప్రవీణ్, ఇరువర్గాల మధ్య గొడవను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, వాగ్వాదం ముదరడంతో హరిగోవింద్ (25) అనే యువకుడు ఆ పోలీసును కిందకు నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. బస్టాండ్‌లో చాలామంది ప్రజల సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఆ సమయంలో ఈ ఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్న మహిళా పోలీసుపై కూడా హరిగోవింద్ దాడి చేసినట్లు సమాచారం. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరు ప్రయాణికులపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గాయపడిన పోలీసు ప్రవీణ్‌ను త్రిసూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన నుదుటిపై అయిన గాయానికి నాలుగు కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, అరెస్టయిన హరిగోవింద్ పోలీసుల విచారణలో బోరున విలపిస్తూ క్షమాపణలు కోరుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులపై కావాలని దాడి చేయలేదంటూ అతడు కన్నీరుమున్నీరైనట్లు తెలుస్తోంది. బస్టాండ్‌లో ఆవేశంతో పోలీసులపై దాడి చేసిన దృశ్యాలకు, అరెస్టయిన తర్వాత ఏడుస్తూ క్షమాపణ చెప్పిన దృశ్యాలకు మధ్య ఉన్న తేడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply