బెంగళూరు: ప్రస్తుతం చాలా ఉద్యోగాల్లో పని ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్య పరంగా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. బెంగళూరులోని ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న ఒక యువకుడు తన పని భారం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పని ఒత్తిడి భరించలేక ప్రతిరోజూ పడుకునే ముందు ఏడుస్తున్నానని అతను తన బాధను వెలిగక్కాడు.
బెంగళూరు ఉద్యోగి ఆవేదన: బెంగళూరులోని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాఫ్ట్వేర్ సంస్థలో ‘హెచ్ఆర్ ఆపరేషన్స్’ (HR Operations) విభాగంలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువకుడు తన కష్టాలను ‘రెడ్డిట్’ (Reddit) వేదికగా పంచుకున్నాడు. అతనికి నెలకు కేవలం రూ. 10,000 మాత్రమే స్టైపెండ్‌గా ఇస్తున్నారు. అక్కడ ఉన్న విషపూరితమైన (Toxic) పని వాతావరణం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని అతను పేర్కొన్నాడు.
ప్రతిరోజూ కన్నీళ్లే: “నేను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. పరిస్థితి అంత దారుణంగా ఉంది. జీవితంలో ఓడిపోయానని, ఎలాంటి పురోగతి లేకుండా ఈ ఉద్యోగంలో చిక్కుకుపోయానని అనిపిస్తోంది. నేర్చుకోవడానికి ఇంటర్న్‌గా చేరాను, కానీ ఇక్కడ నాకు కేవలం ఒత్తిడి మాత్రమే మిగులుతోంది” అని అతను తన పోస్ట్‌లో రాశాడు.
10 గంటల పని: “ప్రతిరోజూ కనీసం 10 గంటల పాటు ఒకే చోట కూర్చుని పనిచేయాల్సి వస్తోంది. మధ్యలో కేవలం 30 నిమిషాలు మాత్రమే విరామం దొరుకుతుంది. దీనివల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరకడం లేదు. నాతో పనిచేసే వారు ప్రతి చిన్న విషయానికి నన్నే నిందిస్తారు. అందరూ తమ పనిని నాపై నెట్టేస్తున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలో పని పూర్తి చేయకపోతే మళ్ళీ నాదే తప్పని అంటారు.
నాకు ఇద్దరు బాస్‌లు ఉన్నారు. ఒకరు పరిస్థితిని అర్థం చేసుకుంటారు, కానీ రెండో బాస్ మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. నా సమస్యలు చెప్పినా వినకుండా సెల్‌ఫోన్ చూసుకుంటూ నిర్లక్ష్యం చేస్తారు. ఏడాదికి రూ. 10 లక్షల జీతం తీసుకునే వారు చేసే పని కంటే ఎక్కువ పని నాపై వేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఇక్కడ కాంట్రాక్ట్ ముగుస్తుంది, ఆ తర్వాత వెంటనే మానేస్తాను” అని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
