ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. అంబానీ, టాటాల మొత్తం సంపదకంటే ఎక్కువ ఆస్తులు.. ప్రైవేట్ ఎయిర్‌లైన్ యజమాని కూడా.. ఆయన ఎవరు?

భారత్‌లో ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా, బిర్లా వంటి పేర్లు ప్రపంచ కుబేరుల జాబితాలో తరచూ వినిపిస్తుంటాయి.

అయితే, భారత్‌లో తొలి బిలియనీర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అన్న విషయం చాలా మందికి తెలియదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆయన సంపద నేటి ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ సంపద కలిపిన దానికంటే కూడా ఎక్కువగా ఉండేదని చారిత్రక అంచనాలు చెబుతున్నాయి.

భారత్ తొలి బిలియనీర్ ఎవరు?

భారత్ తొలి బిలియనీర్‌గా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుగాంచారు. 1937లో ఆయనను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేర్కొంటూ TIME మ్యాగజైన్ తన ముఖచిత్రంపై ప్రచురించింది.

వివిధ చారిత్రక అంచనాల ప్రకారం, 1940ల ప్రారంభంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన సంపద సుమారు 236 బిలియన్ డాలర్లు (ప్రస్తుత విలువ ప్రకారం)గా అంచనా వేయబడింది. అంతేకాదు, 185 క్యారెట్ల జేకబ్ వజ్రాన్ని పేపర్‌వెయిట్‌గా ఉపయోగించేవారని ప్రసిద్ధి.

నిజాం అంతటి సంపద ఎలా వచ్చింది?

1930–40 దశకాల్లో నిజాం కుటుంబానికి అపారమైన రాజవంశ సంపద ఉండేది. అరుదైన వజ్రాలు, ఆభరణాలు, విలువైన రత్నాలు, భూములు, భవనాలు ఆయన సంపదలో ప్రధాన భాగం.

వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది 185 క్యారెట్ల జేకబ్ డైమండ్. ప్రస్తుతం దాని విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే నిజాం దానిని సాధారణ పేపర్‌వెయిట్‌లా ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది.

టర్కీలోనూ నిజాం ఆస్తులు

హైదరాబాద్ నిజాంలకు అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంతో రాజకీయ, వైవాహిక, సాంస్కృతిక సంబంధాలు ఉండేవి. దీంతో టర్కీలోని ఇస్తాంబుల్, బుర్సా వంటి నగరాల్లో కూడా వారికి విలాసవంతమైన బంగ్లాలు, ఇతర స్థిరాస్తులు ఉండేవి.

1910 నుంచి 1924 మధ్యకాలంలో నిజాంలు ఒట్టోమన్ ఖలీఫాకు పెద్ద మొత్తంలో నగదు, విలువైన వస్తువులు పంపినట్లు చారిత్రక రికార్డులు పేర్కొంటున్నాయి. ప్రతిఫలంగా కొన్ని స్థిరాస్తులు నిజాం, హైదరాబాద్ రాష్ట్రం పేర్లపై నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అదనంగా, ఒట్టోమన్ ఖలీఫా బహుమతిగా పంపిన విలువైన కళాఖండాలు, ఆయుధాలు, చారిత్రక పత్రాల్లో కొన్ని ఇప్పటికీ హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయి.

అపార సంపద ఉన్నా సాధారణ జీవితం

విపరీతమైన సంపద ఉన్నప్పటికీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అత్యంత నిరాడంబరంగా జీవించారని ఆయన జీవిత చరిత్రలు చెబుతున్నాయి.

సాధారణ కుర్తా-పైజామా, పాత చెప్పులు, దాదాపు 35 సంవత్సరాల పాటు ఒకే టర్కిష్ టోపీ ధరించేవారని పేర్కొంటారు. ఆ టోపీ చిరిగిపోయినా దానినే ఉపయోగించేవారని చెబుతారు.

ఆయన పడకగదిలో కూడా పాత మంచం, పాడైన ఫర్నిచర్, అరుదుగా శుభ్రం చేసే యాష్‌ట్రే, చెత్త బుట్టలు, సాలీడు గూళ్లు కనిపించేవని చారిత్రక వర్ణనలు పేర్కొంటున్నాయి.

స్వాతంత్ర్యం తర్వాత ఏమైంది?

1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల పాలకులకు భారత్ లేదా పాకిస్థాన్‌లో విలీనం అయ్యే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నిజాం తొలుత స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించగా, అనంతరం భారత్‌లో విలీనం కావడాన్ని వ్యతిరేకించారు.

దీంతో 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం “ఆపరేషన్ పోలో” నిర్వహించి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. దీంతో నిజాం పాలనకు ముగింపు పలికింది.


Posted

in

by

Tags: