ఆఫ్రికా దేశమైన ఘనాలో “ప్రపంచం అంతం కాబోతోంది” అని ఒక వ్యక్తి సృష్టించిన భయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే: ఘనాకు చెందిన ఎబో నోవా అనే వ్యక్తి, తనను తాను ఒక దైవదూతగా ప్రకటించుకున్నాడు. చిరిగిన గోనె సంచులను దుస్తులుగా ధరించి వింతగా కనిపిస్తున్నాడు. నేడు (డిసెంబర్ 25) ప్రపంచం ఒక భారీ జలప్రళయంతో అంతం కాబోతోందని, ఆ విపత్తు నుండి ప్రజలను రక్షించడానికి దైవ ఆదేశం ప్రకారం తాను “నోవా నౌకలను” (Noah’s Arks) నిర్మిస్తున్నానని అతడు చెబుతున్నాడు.
ఆస్తులు అమ్ముకుంటున్న జనం: ఇది నిజమేనని నమ్ముతున్న అతని అనుచరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆస్తులను అమ్ముకుని, ఆ డబ్బును నౌకల నిర్మాణం కోసం అతడికి ఇస్తున్నారు. అంతేకాకుండా తమ పశువులతో సహా అతడి వద్దకు తరలివస్తున్నారు. ఈ నౌకలు సుమారు 3 సంవత్సరాల పాటు నీటిపై తేలియాడేలా నిర్మిస్తున్నట్లు ఎబో నోవా చెబుతున్నాడు.
వాస్తవం ఏంటి?
బైబిల్ వంటి పవిత్ర గ్రంథాల ప్రకారం.. “భూమిని నాశనం చేయడానికి మళ్ళీ ఎన్నడూ జలప్రళయం రాదు” అని స్పష్టంగా ఉందని సామాజిక కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న మోసం కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
అయితే, ఎబో నోవా మాత్రం “దేవుడు ఆపమని చెప్పే వరకు నేను ఈ పనిని కొనసాగిస్తాను, నాకు మద్దతు ఇవ్వండి” అని ప్రజలను కోరుతున్నాడు. క్రిస్మస్ వేడుకల మధ్య ఘనాలో జరుగుతున్న ఈ వింత ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
