ఇరాన్ వ్యవహారాల నడుమ, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ముడి చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నియంత్రణ విషయంలో ఒమన్ అడ్డువస్తే ఆ దేశంపై భీకర దాడులు తప్పవని డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు, హోర్ముజ్ జలసంధి వినియోగానికి సంబంధించి ఇరాన్, ఒమన్ దేశాలు ఒక అవగాహనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీని ప్రకారం వాణిజ్య నౌకలు ఇరాన్ తీర మార్గం గుండా ప్రవేశించి, ఒమన్ తీర మార్గం గుండా బయటకు వెళ్లేలా ప్రణాళిక రచించినట్లు సమాచారం.
ఈ అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. వ్యూహాత్మక చర్చల్లో ఒమన్ ఏమాత్రం అడ్డుతగిలినా వారిపై బాంబుల వర్షం కురిపిస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులతో పరోక్ష చర్చల మార్గాలు ఉన్నాయని ధ్రువీకరించిన ట్రంప్, ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో తమకేమీ తొందరలేదని స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధి చుట్టూ ముదురుతున్న ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
