న్యూఢిల్లీ : చమురు నిక్షేపాలు ఉన్న పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం) రణరంగంగా మారడం, ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటంతో అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కానీ, భారతదేశంలో మాత్రం ధరలు పెరగకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తున్నారు.
దేశీయ చమురు అవసరాల్లో 80 శాతం, ఎల్‌పీజీ (LPG) అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీరుతాయి. ఇందులో 90 శాతం హార్ముజ్ జలసంధి గుండానే వస్తాయి. ఇరాన్ దీనిపై ఆంక్షలు విధించడం వల్ల దేశంలో కొంత చమురు కొరత ఏర్పడినప్పటికీ, ధరలు పెరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.
దిగుమతుల వైవిధ్యీకరణ (Import Diversification): ఈ సంక్షోభ సమయంలో భారత్ కేవలం పశ్చిమ ఆసియా దేశాలపైనే ఆధారపడకుండా, ఇతర దేశాల నుండి చమురు తెప్పించుకునేలా ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా అమెరికా, రష్యా నుండి దిగుమతులను పెంచింది. ఆఫ్రికా ఖండం నుండి రవాణా ఖర్చు ఎక్కువైనప్పటికీ, నైజీరియా మరియు అంగోలా నుండి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఇంధనాన్ని తెప్పించింది.
దౌత్య మార్గం (Diplomatic Route): ఇజ్రాయెల్, అమెరికాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధి ద్వారా తన 6 నౌకలను సురక్షితంగా తీసుకురావడానికి భారత్ దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఒకవైపు ఇరాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, మరోవైపు భారత యుద్ధ నౌకలు చమురు నౌకలకు రక్షణగా నిలిచి జలసంధిని దాటించాయి.
దేశీయ ఉత్పత్తి పెంపు: రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలను కలిగి ఉన్న భారత్, దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచింది. మరోవైపు మొత్తం 2.9 లక్షల ఇళ్లకు పీఎన్‌జీ (PNG) కనెక్షన్లను కల్పించింది.
ఆర్థిక సహాయం: యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు 70 శాతం పెరిగాయి. అయితే దిగుమతి సుంకాన్ని తగ్గించడం ద్వారా చమురు కంపెనీలపై భారాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో చమురు ధరలు తగ్గినప్పుడు కంపెనీలు గడించిన ₹40,000 కోట్ల లాభాలను ఇప్పుడు వినియోగించుకునేలా చేసి, ధరలు పెంచకుండా చూసింది. అదనంగా, ప్రభుత్వం కూడా చమురు కంపెనీలకు ₹30,000 కోట్లు కేటాయించి సామాన్యులపై భారం పడకుండా అడ్డుకుంది.
ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉంది?: బ్రెండ్ ముడిచమురు ధర 70 శాతం పెరిగి, బ్యారెల్‌కు 70 డాలర్లు ఉన్న ధర ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఇంధన ధరలు 30 నుండి 50 శాతం పెరగగా, యూరోప్ దేశాల్లో గ్యాస్ ధరలు 50 శాతం పైగా పెరిగాయి.
