సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ప్రముఖ అమెరికన్ యానిమేషన్ టీవీ సిరీస్ ‘ది సింప్సన్స్’కు సంబంధించిన ఓ ప్రచారం ఇంటర్నెట్లో కలకలం రేపుతోంది.
నవంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈ పరిణామాన్ని ‘ది సింప్సన్స్’ కార్టూన్ సిరీస్ ఎన్నో ఏళ్ల క్రితమే కచ్చితంగా అంచనా వేసిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలకు ఎలాంటి సంబంధం లేదు.
‘ది సింప్సన్స్’ 35వ సీజన్లోని ‘ఇట్స్ ఏ బ్లండర్ఫుల్ లైఫ్’ అనే ఎపిసోడ్లో స్ప్రింగ్ఫీల్డ్ అనే కల్పిత పట్టణంలో చిన్నపాటి విద్యుత్ అంతరాయం చోటుచేసుకునే సన్నివేశం ఉంటుంది.
అయితే, ఆ ఎపిసోడ్లో నవంబర్ 17 అనే తేదీ ప్రస్తావన ఉండటాన్ని ఆధారంగా చేసుకుని కొందరు ఈ ఏడాది నవంబర్ 17న ప్రపంచమంతా చీకటిలో మునిగిపోతుందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. కానీ ఆ ఎపిసోడ్లో ఎక్కడా ప్రపంచవ్యాప్త విద్యుత్ అంతరాయం గురించి గానీ, ఈ ఏడాది అలాంటి ఘటన జరగబోతోందని గానీ ఎలాంటి ప్రస్తావన లేదు.
ఇదిలా ఉంటే, ఇదే తేదీన అమెరికాలోని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (FEMA), ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) కలిసి సాధారణ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాయి. అయితే, ఈ పరీక్షకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు.
కానీ ఈ వాస్తవాలను తెలుసుకోకుండా, కేవలం వ్యూస్, లైక్స్ కోసం కొందరు సోషల్ మీడియా ఖాతాలు ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
కాబట్టి ఇలాంటి వదంతులను చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైనా వార్తను నమ్మే ముందు దాని నిజానిజాలను పరిశీలించాలి. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం వంటి కీలక అంశాలపై అధికారిక సంస్థలు వెల్లడించే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలి.

Leave a Reply