ప్రపంచానికి ఊరట: హోర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో ఓపెన్! దిగొచ్చిన ఇరాన్.. ఇక చమురు కష్టాలకు చెక్?

టెహ్రాన్/న్యూఢిల్లీ: గడిచిన కొన్ని రోజులుగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను వణికించిన ‘హోర్ముజ్’ గండం ఎట్టకేలకు తొలగిపోయింది. వ్యూహాత్మక కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. రేపు లేదా ఎల్లుండి నాటికి ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు యధావిధిగా సాగనున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని పాక్షికంగా మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం గ్యాస్ (LPG) దిగుమతులు ఏకంగా 40 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే.

భారత్‌కు కలిసొచ్చిన దౌత్యం

ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా భారత్‌కు ఇరాన్ ప్రాధాన్యతనిచ్చింది. హోర్ముజ్ మూసివేసిన సమయంలోనూ కొన్ని నిర్దిష్ట భారతీయ నౌకల కదలికలకు ఇరాన్ అనుమతించడం విశేషం. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు గత రెండు నెలలుగా తగ్గినా, అమెరికా ప్రకటించిన 30 రోజుల సడలింపుతో రష్యా నుంచి దిగుమతులు మళ్ళీ పుంజుకున్నాయి. ఇవే కాకుండా అంగోలా, గబాన్, ఘానా వంటి ఆఫ్రికా దేశాల నుండి కూడా భారత్ చమురును సేకరిస్తోంది.

ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా

మధ్యప్రాచ్య దేశాలు హోర్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా పైప్‌లైన్ల ద్వారా సరఫరాను కొనసాగించే ప్రయత్నం చేశాయి.

  • సౌదీ అరేబియా తన ‘ఈస్ట్-వెస్ట్’ (యాన్బు) పైప్‌లైన్‌ను..
  • యూఏఈ తన ‘హబ్షాన్-ఫుజైరా’ పైప్‌లైన్ వినియోగాన్ని పెంచడం ద్వారా కొంతమేర ముప్పును తగ్గించగలిగారు.
ఏప్రిల్‌లో భారీగా దిగుమతులు!

వచ్చే నెల నుండి భారత్‌కు ఇంధన సరఫరా మరింత మెరుగుపడనుంది. ఏప్రిల్ నుండి వెనిజులా నుండి ముడి చమురు బ్యారెల్స్ అందుతాయని అంచనా. అలాగే రష్యాతో పాటు ఇరాన్ నుండి కూడా చమురు కొనుగోలు చేసే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. హోర్ముజ్ అడ్డంకుల వల్ల ఖతార్ నుండి వచ్చే ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరా 92 శాతం మేర నిలిచిపోయినా.. అమెరికా, ఒమన్, నైజీరియా వంటి దేశాలు ఆ లోటును భర్తీ చేశాయి.

నిప్పు రాజేస్తున్న ఇజ్రాయెల్!

ఒకవైపు ఇరాన్ శాంతి దిశగా అడుగులు వేస్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే వందకు పైగా కేంద్రాలపై దాడులు చేశామని, లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదని ఇజ్రాయెల్ కుండబద్దలు కొట్టింది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే మళ్లీ హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: