ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని 40 ఏళ్లుగా పెట్టెల్లో పుస్తకాలను మోశాడు! నేడు 10 వేల మంది పిల్లలకి ఇష్టమైన ‘మూసా మామ’. కదిలించే నేపథ్యం!

పిల్లల చేతికి ఒక పుస్తకం అందితే, అది వాళ్ల ప్రపంచాన్నే మార్చేస్తుంది. కానీ, ఆ పుస్తకం వారిని చేరడానికి ఎంతమంది శ్రమ అవసరమో చాలామందికి తెలియదు. కేరళకు చెందిన సత్యనారాయణ ముండయూర్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొండ గ్రామాల్లో నివసించే పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి తన జీవితంలో 40 ఏళ్లకు పైగా అంకితం చేశారు. తన పెద్ద పేరును పలకడానికి ఇబ్బంది పడే పిల్లల కోసం ఆయన ఒక సులభమైన పేరును ఎంచుకున్నారు. నాటి నుంచి వేలాది మంది పిల్లలు ఆయనను ముద్దుగా ‘మూసా మామ’ అని పిలుచుకుంటారు. ఆయన ప్రారంభించిన ఈ ప్రయత్నం నేడు ఎన్నో గ్రామాల పిల్లలకు పుస్తక పఠనాన్ని పరిచయం చేసింది.

కేరళలో పెరిగిన సత్యనారాయణకు చిన్నప్పటి నుంచే గ్రంథాలయాలపై ఆసక్తి ఉండేది. ఆ తర్వాత ముంబైలో ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. కానీ, స్వామి వివేకానందుని విద్యా విధానాలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో 1979లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, అరుణాచల్ ప్రదేశ్‌లోని వివేకానంద కేంద్ర పాఠశాలలో పనిచేయడానికి వెళ్లారు. అక్కడి లోహిత్ లోయ ప్రాంతాల్లోని చాలా పాఠశాలల్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని పరిస్థితి ఉండేది. పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు హాస్టళ్లలో కథలు చెప్పడం ప్రారంభించారు. ప్రారంభంలో పిల్లలకు ఇష్టమైన కథలను ఎంపిక చేయడంలో ఇబ్బంది ఎదురైనా.. ఆ తర్వాత వారికి ఇష్టమైన పుస్తకాలను వెతికి పట్టుకుని, దేశవ్యాప్తంగా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వాటిని పెట్టెల్లో సర్ది.. బస్సులు, షేరింగ్ జీపులు, గూడ్స్ వాహనాలు ఇలా పలు మార్గాల్లో కొండ గ్రామాలకు స్వయంగా మోసుకెళ్లారు.

సుమారు 20 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత పరిపాలనా బాధ్యతల్లో పనిచేసిన ఆయన.. సెలవు దినాల్లో పిల్లలకు పుస్తకాల బ్యాగులు ఇచ్చి వారి గ్రామాల్లో చిన్న గ్రంథాలయాలు ఏర్పడేలా చేశారు. ఆ తర్వాత అందరూ ఉపయోగించుకునేలా పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. బాలల రచయితలు, చిత్రకారుల సంఘం ద్వారా సుమారు 9,000 పుస్తకాలు కూడా ఆయనకు లభించాయి. ఐఏఎస్ అధికారి ప్రశాంత్ లోఖండే సహకారంతో 2007లో తేజు ప్రాంతంలో తొలి కమ్యూనిటీ లైబ్రరీ ప్రారంభమైంది. దీని తర్వాత వెదురు గ్రంథాలయం సహా పలు కార్యక్రమాలు చేపట్టారు. యువత కూడా వాలంటీర్లుగా చేరారు. పాఠశాల ముగిసిన తర్వాత పిల్లలు సంతోషంగా వచ్చి పుస్తకాలు చదువుకునేలా గ్రంథాలయాలు పనిచేయడం ప్రారంభించాయి. దీని కొనసాగింపుగా లోహిత్ యూత్ లైబ్రరీ నెట్‌వర్క్‌లో 13 గ్రంథాలయాలు చేరాయి. తేజు, వక్రో, నామ్‌సాయి, రోయింగ్, అంజావ్ తదితర ప్రాంతాల్లోని సుమారు 10,000 మంది పాఠకులకు పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఈ పని ఇంకా పూర్తికాలేదని ఆయన భావిస్తున్నారు. పిల్లలకు విద్యలోని ఆనందాన్ని పరిచయం చేయడానికి బదులుగా, కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసమే బోధిస్తున్న ప్రస్తుత విద్యావిధానంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ సరిగా చదవలేని పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే గిరిజన బాలికలకు కూడా ఆయన మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ గ్రంథాలయాల నిర్వహణలో పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి వేతనం ఉండదు; ఆయన కూడా పూర్తి సమయం ఈ పనిలో నిమగ్నమైనప్పటికీ ఎలాంటి జీతం తీసుకోరు. ఒకప్పుడు ఆయన వద్ద కథలు విన్న పిల్లల్లో చాలా మంది నేడు గ్రంథాలయాలు నడుపుతున్న యువకులుగా ఎదిగారు. “పాఠకులు పుస్తకాలను వెతుక్కుంటూ వెళ్లలేకపోతే, పుస్తకాలే పాఠకులను వెతుక్కుంటూ వెళ్లాలి” అన్నదే మూసా మామ జీవిత సిద్ధాంతం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *