ప్రభుత్వ ఉద్యోగాలు నిర్ణీత అర్హత కలిగిన అభ్యర్థులకే దక్కాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ విద్యార్హత ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులను అనుమతించడం, నిజమైన అర్హులైన అభ్యర్థులను అవకాశాలకు దూరం చేయడమేనని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ఏమందంటే? మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును కొట్టివేస్తూ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక తాత్కాలిక బ్యాంక్ సహాయకుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సదరు ఉద్యోగి తన గ్రాడ్యుయేషన్ విద్యార్హతను దాచిపెట్టి, కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేసే ఉద్యోగాన్ని పొందిన విషయాన్ని హైకోర్టు గమనించలేదని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఆదర్శవంతమైన నిర్ణయం: తక్కువ విద్యార్హత ఉన్న పోస్టుల కోసం ఉన్నత విద్యార్హత కలిగిన వారిని అనుమతించడం వల్ల, తక్కువ విద్యార్హత ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. “జీవిత పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇలాంటి వారిని, ఎక్కువ చదువుకున్న అభ్యర్థులతో పోటీ పడకుండా కాపాడటం కోసం ప్రభుత్వం కొన్ని పోస్టులను నిర్దిష్ట అర్హతలతో కేటాయించడం సరైన పద్ధతి. ఇటువంటి విధానాలను కోర్టులు ఎప్పుడూ సమర్థించాయి” అని ధర్మాసనం పేర్కొంది.
