వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన తిరుపూర్‌లో అనేక లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. వ్యాపార పనుల మీద నగరానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఇలాంటి హోటళ్లలో స్టే చేయడం సాధారణం. ఈ క్రమంలోనే పల్లడమ్ ప్రాంతానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త హోటల్‌లో రూమ్ తీసుకుని, ఆస్తి వివాదంపై చర్చించడానికి తన బంధువును అక్కడికి పిలిపించాడు. కానీ, చివరికి అక్కడ జరిగిన సంఘటన తిరుపూర్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
అసలు ఏం జరిగిందంటే?
తిరుపూర్ జిల్లా పల్లడమ్ సమీపంలోని కామనాయకన్‌పాళయంకు చెందిన అమరన్ ఒక పారిశ్రామికవేత్త. ఈయన తిరుపూర్ బంగ్లా స్టాప్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో 4వ అంతస్తులో రూమ్ నంబర్ 402 తీసుకుని స్టే చేస్తున్నాడు. ఆ తర్వాత తన బంధువు, పల్లడమ్ ప్రాంతంలో బనియన్ వ్యాపారం చేస్తున్న సెంథిల్ నాథన్‌ను చర్చల నిమిత్తం హోటల్‌కు పిలిచాడు.
చర్చలు విఫలం – ఘోర హత్య:
రూమ్ నంబర్ 402లో ఆస్తి వివాదంపై వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆగ్రహానికి గురైన అమరన్, తాను ముందే దాచిపెట్టుకున్న కత్తిని తీసి సెంథిల్ నాథన్ కడుపులో పొడిచి, గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో ఉన్న సెంథిల్ నాథన్ ప్రాణాలు కాపాడుకోవడానికి గది బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో 3వ అంతస్తుకు చేరుకోగానే అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
పోలీసుల రంగప్రవేశం:
హోటల్ సిబ్బంది సమాచారం మేరకు తిరుపూర్ నార్త్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సెంథిల్ నాథన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన అమరన్‌ను అదే హోటల్ గదిలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
విచారణలో తేలిన విషయాలు:
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు అమరన్, బాధితుడు సెంథిల్ నాథన్ బంధువులని తేలింది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి అమరన్ హోటల్‌లో రూమ్ తీసుకుని సెంథిల్ నాథన్‌ను రప్పించాడు. అయితే చర్చలు సఫలం కాకపోవడంతో ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. సెంథిల్ నాథన్ గొంతు కోయడమే కాకుండా పొట్టలో కూడా పలుమార్లు పొడిచినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. పట్టపగలు ప్రముఖ హోటల్‌లో జరిగిన ఈ హత్య తిరుపూర్‌లో కలకలం రేపింది.
